9న ఆవిష్కరణకు సిద్ధం
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైన వేళ.. విగ్రహం ఏ రూపంలో ఉండబోతుందోనని ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ప్రతిమ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 9న ఆవిష్కరించనున్నారు. కాగా, ఈ ఫోటోలో చూపిన ప్రకారం, తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీరలో ఉంది. మెడలో నగలు, చేతికి ఆకుపచ్చ.. ఎరుపు రంగులో గాజులు, ఎర్రటి కుంకుమ బొట్టు, ఒక చేతిలో కంకులు, వరిపైరు కనిపిస్తున్నాయి.
ఇంకో చేతితో ప్రజలను ఆశీర్వదిస్తున్నట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాళ్లకు వెండిపట్టీలు, మెట్టెలు ఉన్నాయి. అలాగే పిడికిళ్లు బిగించి ఉన్న చేతులు, విగ్రహాన్ని మోస్తున్నట్లుగా చేతులతో గద్దె భాగాన్ని రూపొందించారు.