15-03-2025 07:00:40 PM
సదస్సులో పలువురు వక్తలు..
ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో 15 శాతం నిధులు విద్య రంగానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మదర్స్ అసోసియేషన్, దళిత బహుజన ఫ్రంట్, ఎంవి ఫౌండేషన్, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. సందర్భంగా హాజరైన సదస్సుకు ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, వెంకట్ రెడ్డి, కనగంటి రవి, శంకర్, ప్రసన్న, హరి కృష్ణలు మాట్లాడుతూ... దేశంలో విద్యరంగానికి బడ్జెట్ లో సగటున 15 శాతం కేటాయిస్తుంటే, తెలంగాణ రాష్ట్రలో 7.3 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భీమరు రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో 16 నుండి 17 శాతం విద్య రంగానికి కేటాయిస్తున్నారని, సౌత్ రాష్ట్రాలలో ఈ శాతం సగటు 13 నుండి 14 శాతం ఉందన్నారు. బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ప్రతియేటా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయన్నారు. నిరుపేద విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. విద్య రంగానికి బడ్జెట్ తగ్గించడం వల్ల ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలపై ప్రజలు విశ్వసనీయత కోల్పోతున్నారని పేర్కొన్నారు. అలాగే కార్పొరేట్ స్కూల్ లలో ఫీజుల నియంత్రణతో పాటు, అక్కడ విద్య ప్రమాణాల పర్యవేక్షణ ఉండాలన్నారు. విజ్ఞాన సమాజం కోసం పాలకులు కట్టుబడి ఉంటే, బడ్జెట్ లో కనీసం 15 శాతం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.