calender_icon.png 21 March, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్రం దేశానికే మాడల్

21-03-2025 01:13:53 AM

  1. ఉద్యోగాల కోసం ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తున్నారు
  2. 30-40 రోజుల్లో గ్రూప్-1,2,3 నియామకాలు
  3. ఉద్యోగ నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): దేశానికే తెలంగాణ రాష్ట్రం మాడల్ అని, పదేళ్లలో గత ప్రభుత్వం చేయని పనులను తమ ప్రభుత్వం కేవలం పదినెలల్లో చేసి చూపించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ధరల నియంత్రణ, నిరు ద్యోగ రేటు తగ్గింపు, పన్నులు సేకరించడం లో తెలంగాణ ముందున్నదని తెలిపారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం వస్తున్నారని, గుజరాత్.. ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చే సుంటే అక్కడికి పోకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ఎందుకొస్తున్నారని, అ భివృద్ధి మాదా.. మీదా? అని ప్రధానమంత్రి మోదీని సీఎం ప్రశ్నించారు.

గురువారం రవీంద్రభారతిలో ‘ప్రజా పాలనలో కొలువుల పండుగ’ పేరిట పంచాయతీరాజ్, రూ రల్ డెవలప్‌మెంట్, పురపాలక శాఖల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన, కారుణ్య ని యామకాలు పొందుతున్న 922 అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం రేవం త్‌రెడ్డి, మంత్రి సీతక్క అందించారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశిస్తూ సీఎం మాట్లా డారు..

ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే యువ త బీఆర్‌ఎస్‌ను ఓడించి వారి ఉద్యోగాలను ఊడగొట్టారన్నారు. కారుణ్యం అనే పదానికి బీఆర్‌ఎస్‌కు అర్థం తెలియదని విమర్శించారు. నిజామాబాద్, కరీంనగర్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓడిపోతే వారికి వెంటనే కేసీఆర్ మళ్లీ ఉద్యోగాలిచ్చారని, కానీ పదేళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వలేదన్నారు.

కారుణ్య నియామకాలు కల్పించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ తో పాటు కారుణ్య నియామకాలు కూడా ఇ వ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. 

మీరెందుకు చేయలేకపోయారు..?

చిన్నదైనా, పెద్దదైనా మొదటి అవకాశం జీవితకాలం గుర్తుంటుందని, తనకు సీఎం కంటే జడ్పీటీసీ అయినప్పుడే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. 20ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, తన టెంపర్‌మెంట్‌లో ఎప్పుడూ మార్పులేదని, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తాను ఒకేలా ఉంటానన్నారు.

ఈ రోజు 500 మం దికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలిస్తున్నామని, కారుణ్య నియామకాలు ఉద్యోగుల కుటుంబాల హక్కు అని చెప్పా రు. తాము అధికారంలో రాగానే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను ప్రజా ప్రభుత్వంలో భర్తీ చేశామని, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు దాదాపు 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

అయితే తామే నోటిఫికేషన్లు వేశామని, మేం చేసింది ఏం లేదని కొందరు మాట్లాడుతున్నారని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శిం చారు. ‘పదేళ్లు  పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా? మీ ఇంటిబిడ్డలకు పదవిపోతే ఇంకో పదవి ఇచ్చుకున్న మీకు... తెలంగాణలో ఈ పేదింటి బిడ్డల బాధ కనిపించలేదా?’ అని ప్రశించారు. 

పట్టు ఎందులో ఉండాలి..?

పాలనలో తమకు పట్టు రాలేదని మాట్లాడుతున్నారని, పట్టు ఎందులో ఉండాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఈటల రాజేందర్‌లాంటి బలహీనవర్గాలను పదవుల నుంచి సస్పెండ్ చేస్తేనే పట్టు వచ్చినట్టా? అని నిలదీశారు. సచివాలయానికి ప్రతిరోజు వస్తున్న రేవంత్‌రెడ్డికి పట్టు వచ్చినట్టా?..లేకపోతే అసలు సచి వాలయానికి సరిగా రాని కేసీఆర్‌కు వచ్చినట్టా? అని మండిపడ్డారు. ప్రజలకు ఎప్పు డూ అందుబాటులో ఉన్న తనకు రాలేదా? ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనా వాళ్లకు పట్టు రాలేదా? అని విమర్శించారు. 

పోటీలతో పర్యాటక రంగానికి ఆదాయం

మిస్ యూనివర్స్ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ పోటీలను తెలంగాణలో నిర్వహించడం ద్వా రా రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. మే 7 నుంచి 31 వరకు ప్రపంచ దేశాలన్నీ ఈ పోటీలకు హాజరవుతున్నాయని, పర్యాటక రంగానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమన్నారు.

వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతిని ధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శించబోతున్నార న్నారు. 72వ మిస్ యూనివర్స్ పోటీలతో ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతుందని, భవిష్యత్‌లో వందల కోట్ల ఆదాయం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్ము లా ఈ-రేస్ ముసుగులో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో ‘మీకు మాకు పోలికా?’ అని ప్రశ్నించారు. 

అప్పు పుడ్తలేదు..

రాష్ట్ర అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంద ని, దానికి వడ్డీనే ఈ 15 నెలల్లో రూ.1.53 లక్షల కోట్లు కట్టినట్లు సీఎం తెలిపారు. తాను ఉన్నన్నీ రోజులు వడ్డీ ఎప్పటికీ కట్టాల్సిందేనన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా చేద్దా మంటే అప్పు పుట్టడంలేదన్నారు. అందుకే తాను పదే పదే ఢిల్లీకి వెళ్లి తమకు న్యాయం గా రావాల్సిన నిధులు, అప్పులపై వడ్డీ భా రం పడకుండా కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం ఉద్యో గులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలు రూ.8వేల కోట్లు పెట్టి వెళ్లిందన్నారు. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే రూ.58 లక్షల వరకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా భారీగా దోచుకున్నట్లు ఆరోపించారు. తాను ప్రభుత్వంలోకి వచ్చాక ఇసుక విక్రయం ద్వారా రోజుకు అదనంగా రూ.౩ కోట్ల వరకూ ఆదాయం వస్తుందన్నారు.

ఎందుకు కోపం?

ప్రజలు తమపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారని, అసలు ప్రజలు తమపై ఎందుకు కోపంగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేసినందుకా? ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం అందించినందుకా? 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు కోటీశ్వరులను చేసినందుకా?, 59 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకా?, విద్యార్థులకు డైట్ చార్జీలు, కాస్మోటిక్స్ చార్జీలు భారీగా పెంచినం దుకా? ఎందుకు కోపంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు. 

30,40 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు పూర్తి 

కేవలం పది నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ర్టం దేశంలో ఎక్కడా లేదన్నారు. గ్రూప్ 1, 2, 3 లలో 2వేల పైచిలుకు ఉద్యోగాలకు 30-40 రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నామన్నారు. తాము చేయలేదు కాబట్టి మమ్మల్ని చేయనీయకూడదనే ధోరణిలో బీఆర్‌ఎస్ తీరు ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే “బిల్డ్ నౌ పోర్టల్‌” తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎంతటివారైనా సరే ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాల్సిందేనని చెప్పారు. 

ఉద్యమంలా ఉద్యోగాలు: మంత్రి సీతక్క

నాడు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే...ప్రజా ప్రభుత్వంలో ఉద్యమంలా, యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని మంత్రి సీతక్క చెప్పారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన ములుగు జిల్లా నుంచి వెంకటలక్ష్మీ, మహబూబాబాద్ నుంచి ప్రియాంక, ఖమ్మం నుంచి కల్పన, మంచిర్యాల నుంచి మామిడి సాయికృష్ణతోపాటు మరికొంత మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ మేయర్ పాల్గొన్నారు.