calender_icon.png 2 April, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటినుంచి పది పరీక్షలు..!

21-03-2025 12:39:48 AM

మెదక్, మార్చి 20(విజయక్రాంతి)ః పదవ తరగతి పరీక్షలు ఈనెల 21 నుండి ప్రారంభం అవుతున్నాయి. శుక్రవారం నుండి జరిగే పది పరీక్షలకు జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే పది పరీక్షలకు 68 సెంటర్లలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల పర్యవేక్షణలో భాగంగా ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 17 మంది సిట్టింగ్ స్క్వాడ్ లు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 70 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 590 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశా ఉంటారని, ఫ్లయింగ్ స్క్వాడ్ లు రెండు బృందాలుగా, ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున, ఆ ఆరుగురిలో ఇద్దరు రెవెన్యూ నుంచి, ఇద్దరు విద్యా శాఖ నుంచి, ఇద్దరు పోలీసులు ఉంటారని అధికారులు తెలిపారు. మూడు రూట్లలో ముగ్గురు రూట్ అధికారులను కేటాయించామని వెల్లడించారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు. 

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్... జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, బెంచీలు, బల్లలు, కుర్చీలు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. పోలీస్ ఎస్కార్ట్ తో ప్రభుత్వ వాహనంలో నిర్దేశించిన ఆయా రూట్లలో మాత్రమే పరీక్ష పేపర్లను పరీక్ష కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, రబ్బర్, హల్ టికెట్లను మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ప్రతి సెంటర్ కు ఇద్దరు కానిస్టేబుళ్ళతో బందోబస్తు నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు కాంపౌండ్ వాల్ లేని వాటికి బారికేడ్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు, ఔషధాలు, వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్ లు సరిపడా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.