హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సచివాలయంలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) భద్రతను చేపట్టింది. సచివాలయ భద్రతకు ఎస్‌పిఎఫ్‌కు చెందిన మొత్తం 214 మంది సిబ్బంది శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గేట్ల వద్ద సాయుధ గార్డు విధులు నిర్వహించేందుకు, ఇతర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేందుకు, అంతర్గత నిఘాను నిర్వహించడానికి ప్రభుత్వం ఎస్పీఎస్ సిబ్బందిని కేటాయించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్ నేతృత్వంలో భద్రతా సిబ్బంది లాంఛనంగా విధుల్లో చేరే ముందు సచివాలయం ఆవరణలో పూజలు నిర్వహించారు.
ప్రారంభంలో, సచివాలయం తెరిచిన తర్వాత ఎస్పీఎస్ భద్రతను నిర్వహించింది. అయితే గతేడాది ఏప్రిల్ 25న తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)కి భద్రత నిర్వహణను బదిలీ చేశారు. ఆగస్టు 5న, భద్రత, అగ్నిమాపక రక్షణ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణను అందించి, ఎస్‌పిఎఫ్‌కి భద్రతను తిరిగి ఇవ్వాలని డీజీపీ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుపై చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసుల నుండి భద్రతా బాధ్యతలను తీసుకోవాలని ఎస్పీఎస్ ను ఆదేశించింది.