01-03-2025 12:47:25 PM
ప్రమాదం జరిగి వారం రోజులు పూర్తి
ఎనిమిది మంది కార్మికుల్లో ఐదు చోట్ల మానవ అవశేషాలు ఉన్నట్లు గుర్తింపు.
మరో ముగ్గురు కార్మికులు క్షేమ సమాచారం కోసం గాలింపు ముమ్మరం.
టర్నల్ లోని ఘటనా స్థలికి మంత్రులు ఉత్తం, జూపల్లి, సిఎస్ శాంత కుమారి.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో వారం రోజుల క్రితం జరిగిన ప్రమాద ఘటనలో 8 మంది కార్మికులు చిక్కుకోగా దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, ఎల్అండ్ టి, హైడ్రా వంటి 12 రకాల రెస్క్యూ టీం బృందాలన్నీ 600 మందికి పైగా నిర్విరామంగా పనిచేస్తూ కార్మికుల ఆచూకీ కోసం సొరంగంలోనే( SLBC tunnel rescue) శ్రమిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సొరంగంలోని పేరుకు పోయిన బురద మూడు మీటర్ల కింది భాగంలో మానవ అవశేషాలు ఉన్నట్లు సాంకేతిక నిపుణుల ద్వారా ఆక్వాఐ, గ్రౌండ్ పినేట్రేటింగ్ రాడర్ (జిపిఆర్) వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఐదుచోట్ల గుర్తించారు. అవి దాదాపుగా కార్మికుల మృతదేహాలే అయి ఉంటాయని రెస్క్యూ టీం బృందాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మికుల సొంత ప్రాంతాలకు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం తరలించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ముందు ఎనిమిది ప్రైవేటు అంబులెన్స్ ల ద్వారా మృతదేహాలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరో పక్క ఎనిమిది మందిలో ఇద్దరూ ఇంజనీర్లు మరో ఇద్దరు టీబీఎం మిషన్ ఆపరేటర్లు కాగా మరో నలుగురు కార్మికులు ఉన్నారు. ఐదు చోట్ల నమూనాలను గుర్తించగా మరో ముగ్గురి ఆచూకీ కోసం సుమారు 24 గంటలుగా ప్రయత్నిస్తున్నా ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగిన స్థలంలో టీబీఎం మిషన్ సుమారు 100 మీటర్ల వెనక్కి తోసుకురావడంతో సొరంగం చివర భాగంలో ఖాళీ ప్రదేశం ఉండి ఉంటుందని ఆ ప్రదేశంలో కార్మికులు రక్షణ ప్రదేశంగా ఎంచుకొని అక్కడ తలదాచుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
టిబిఎం యంత్రంలో కూడా ఉండి ఉంటారని అనుమానిస్తూ భారీ గ్యాస్ కట్టర్ల సహాయంతో టర్నల్ బోరింగ్ మిషన్ యంత్రాన్ని ముక్కలుగా వేరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘటనా స్థలికి మెడికల్ ఫ్లోరెన్సీక్ సిబ్బందిని సైతం రప్పించింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో ఉండి ఉంటే వారిని రక్షించేందుకు అంబులెన్స్, ఆర్మీ మెడికల్ సిబ్బంది అందరూ సంఘటన స్థలానికి వెళ్లి నిరీక్షిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర సిఎస్ శాంత కుమారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. మరో పక్క నీటి ఊట, బురద తొలగింపు చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.