calender_icon.png 15 February, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణ వేదికవ్వాలి

15-02-2025 01:35:12 AM

  1. ఆదాయ, ఉపాధి వనరుగా పర్యాటక రంగం
  2. పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహాకాలు 
  3. భువనగిరికోట రోప్‌వేకు త్వరలో టెండర్లు
  4. పర్యాటకంలో ఆలయాలు, పులుల అభయారణ్యాలకు ప్రాధాన్యం 
  5. బడ్జెట్ కేటాయింపులు పెంచుతాం 
  6. పర్యాటకశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు తెలంగాణను వేదికగా నిలపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రోత్సాహాకాలు అందించాలని సూచించారు. అలాగే, నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో బోట్‌హౌస్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

శుక్రవారం పర్యాటకశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటకశాఖను తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే వనరులు తెలంగాణలో అనేకం ఉన్నాయని, గత పాలకులు వాటికి ప్రచారం కల్పించడంపై దృష్టి సారించలేదన్నారు.

అందుకే ఈ రంగంలో ఆశించిన పురోగతి కనిపించలేదన్నారు. తెలంగాణ చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్‌కు బాటలు వేసేలా పర్యాటక శాఖకు వినూత్న రూపంలో ప్రచారం కల్పించాలన్నారు. 

అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు అధిక ప్రాధాన్యం 

భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెలతీర్థం, బొగతా జలపాతం, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు ఇలా ప్రతీ ఒక్క పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. భువనగిరికోట రోప్‌వే పనులపై సీఎం ఆరా తీశారు.

భూసేకరణలో కొంత జాప్యం జరిగిందని, తాజాగా భూసేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. తెలంగాణ టూరిజంలో అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు అధిక ప్రాధాన్య మివ్వాలన్నారు. ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాట కంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, ఆ దిశగా దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

పాలసీ విధానాల విషయంలో జాగ్రత్త

పర్యాటక శాఖ పాలసీకి తుదిరూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీఐఐసీ, వైద్య, క్రీడశాఖలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య అవసరాల కోసం విదేశాల నుంచి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామన్నారు. సమీక్షలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.