డా. పల్లేరు వీరస్వామి :
ధర్మపురి శేషప్పకవి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని సంబోధిస్తూ 1900లో ‘నరసింహ శతకం’ రాశాడు. ఈ శతకం ఆధ్యాత్మపరులనేకాక సంప్రదాయాభిమానులనూ, సామాన్యులనూ విశేషంగా ఆకట్టుకుంది. నేటికీ కొందరు వృద్ధులు భక్తిభావంతో ఈ శతకంలోని పద్యాలను గొంతెత్తి పాడుతూ తన్మయులవుతారు.
తెలుగులో నన్నయ అవతరణంలో తెలుగు కవిత్వానికి ఒక పలుకుబడి అబ్బింది. ఒక రూపం ఏర్పడింది. ఒక అభివ్యక్తి ఏర్పడింది. అట్లా కొన్ని తరాలు ప్రభావితమయ్యాయి. ఆయన ఆదిపర్వంలో ‘నాగస్తుతి’ సన్నివేశంలో ఉదంకుని ద్వారా ‘మాకు బ్రసన్ను డయ్యెడున్’ అనిపించాడు. నాలుగు పద్యాలలో ఇవే పదాలను చివరలో ప్రయోగించాడు. అలాగే, నన్నెచోడుడు తన ‘కుమార సంభవ’ కావ్యంలో ‘దారిద్య్ర విద్రావణా!’ అనే పద సంపుటిని పది పద్యాల చివరలో వేశాడు. వీటిని విమర్శకులు శతకానికి ‘బీజావాపనం’ అన్నారు.
మల్లికార్జున పండితారాధ్యుడి ‘శ్రీ గిరి మల్లికార్జునా!’ మకుటంలో శతక లక్షణం గల ఒక పద్యం లభ్యమవుతున్నది. అది
లోకము లెల్ల నీతనువు లోనివ, నీవట యెంత కల్గుదో
నాపక పద్మ సంభవ జనార్దను లాదిగ నెల్ల పెద్దలున్
నీ కొలదింత యంత యననేరక మ్రొక్క దొడంగిరన్న, ని
న్నేకరణిన్, నుతింతు బరమేశ్వర శ్రీగిరి మల్లికార్జునా!
దీని ఆధారంగా పండితుడు శతకమనక పోయినా, ‘శతకంబు శివతత్త్వ సారంబు దీపకళిక’ అని పాల్కురికి సోమన్న అనడం వల్ల ఆ శివయోగి రచన శతకం అనబడుతున్నది. అయితే, పాల్కురికి సోమన్న రాసిన ‘వృషాధిప శతకం’ సమగ్రమైన ‘తొలి శతకమని’ విమర్శకులు చెప్పారు. అంతేకాదు ద్విపద, అచ్చతెలుగు, నిరోష్ఠ్యం, అష్టకం, ఉదాహరణ, గజల్స్, ప్రపంచపదులు, నానీలు వంటి ప్రక్రియలకు కూడా తెలంగాణ జన్మనిచ్చింది. ప్రజల కొరకు ప్రజలభాషలో కవిత్వాన్ని చెప్పిన విప్లవాత్మక కవిగా సోమన్న ఆరాధ్యుడే.
‘ఆంధ్ర మహాభాగవతాన్ని’ రాసి తాను తరించి లోకాన్ని పుణ్యస్థలిగా మార్చిన పోతన్నకూడా (1400--1450) ‘నారాయణ శతకం’ రాశాడు. ఇందులో ఆయన వ్యక్తిత్వం ఉదాత్తంగా దర్శనమిస్తుంది. ప్రజా జీవితాన్ని చిత్రించడంలో నిపుణతను సాధించిన రావిపాటి త్రిపురాంతకుడు (13 శతాబ్ది ఉత్తరార్ధం) ఉద్గ్రంథాలు చాలా రాశాడు. అయితే, ఆయన రాసిన ‘అంబికా శతకం’ సాహిత్యంలో విశేష ప్రాచుర్యాన్ని పొందింది. తన జీవితాన్ని రామార్చనకే అంకిత చేసుకున్న రామదాసు ప్రభుత్వ ధనంతో ఆలయాన్ని నిర్మించి జైలు పాలై అనేక కష్టాలను సహించాడు. ఆయన రాసిన ‘దాశరథీ శతకం’ ఈనాటికీ బహుళ ప్రచారంలో ఉంది. దాన్ని భగవత్ సంబోధనాత్మకంగా రాస్తూ ఎన్నో సామాజిక విషయాలను కూడా చొప్పించి సజీవం చేశాడు. గోపన్న రాసిన కీర్తనలు ఎన్ని ఉన్నా ఆయన అసలైన రామభక్తికిదే పరాకాష్ఠ.
గణపతిదేవ చక్రవర్తి సామంతరాజు బద్దె భూపాలుడు (1260). ఈయన ‘నీతిశాస్త్ర ముక్తావళి’తోపాటు ‘సుమతి శతకం’ కూడా రాశాడు. నీతులకు గని అనిపించుకున్న ఈ శతకం అనంతర శతక సాహిత్యాన్నేకాక మొత్తం సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. నేటకీ తెలుగునాట ప్రతి నోరూ సుమతీ శతక పద్యాలను ఉటంకించడం కన్పిస్తుంది. కృష్ణభక్తుడు సంజీవకవి 1706లో కొలనుపాకలో నెలకొన్న వీరనారాయణ స్వామినుద్దేశించి ‘వీరనారాయణ శతకం’ రాశాడు. ఇది భక్తినేకాక సమకాలీన ప్రజా జీవితాన్ని ప్రతిబింబించింది. కొలనుపాక ప్రాంతం వారు నేటికీ ఈ శతకంలోని పద్యాలను గళమెత్తి పాడడం కనిపిస్తుంది. ధర్మపురి శేషప్పకవి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని సంబోధిస్తూ 1900లో ‘నరసింహ శతకం’ రాశాడు. ఈ శతకం ఆధ్యాత్మపరులనేకాక సంప్రదాయాభిమానులనూ, సామాన్యులనూ విశేషంగా ఆకట్టుకుంది. నేటికీ కొందరు వృద్ధులు భక్తిభావంతో ఈ శతకంలోని పద్యాలను గొంతెత్తి పాడుతూ తన్మయులవుతారు. 19వ శతాబ్దికి చెందిన మరొక అజ్ఞాతకవి ‘నరహరి శతకం’ రాశాడు. ఈ శతకంలోని ధార మనోజ్ఞంగా ఉంది. కొద్దిపాటి అక్షరజ్ఞానమున్నవారు కూడా ఈ రచనను చదివి ఆనందింపవచ్చు.
కొలనుపాక నివాసి తరువాయి వెంకటకవి 1840 లో ఒక శతకం రాశాడు. చేర్యాల సమీపంలోని ధూళిమిట్ట నివాసి సంగభట్టు నరసింహరాజు ‘శ్రీ యాదగిరీశ్వర స్తోత్రరత్నము’ శతకాన్ని భక్తిభావంతో రాశాడు. ఇది అరబ్బీ, పార్శీ, ఉరుదూ పదాల పోహళింపుతో బాగా చవులూరిస్తుంది. సంగీత సాహిత్య కళామర్మజ్ఞుడు శ్రీరంగరాజు కేశవరావు ‘దాశరథీ శతకం’ రాశాడు. ఇది వివిధాలంకార వైచిత్రితో చక్కని సాహితీమూల్యాలతో సాహిత్యాన్ని పుష్టమంతం చేసింది. దీనికి ప్రేరణ కంచర్ల గోపన్న ‘దాశరథీ శతకం’ అయినా ఇందులో నవ్యత చాలా చోటు చేసుకున్నది. అభివ్యక్తిలో చక్కని భావావేశం పొంగి పొరలుతుంది. మహాకవి దాశరథి కూడా ‘దాశరథీ శతకం’ రాశాడు. అది రామభక్తిని ప్రకటించేది మాత్రం కాదు. వర్తమాన సాంఘికాంశాలను అధిక్షేప ధోరణిలో రాసింది. ఇది ఆధునిక సాహిత్యంలో గొప్ప కదలికలను సృజించడమేకాక శతక కవులకు మార్గాన్ని నిర్దేశించింది కూడా.
ఖిలాషాపురం గ్రామానికి చెందిన మరొక కవి పండితుడు చొల్లేటి నృసింహశర్మ 1961లో ‘యాదగిరి లక్ష్మీనృసింహ శతకం’ రాశాడు. ఇది విమర్శకుల రాతలలో విస్తృత ప్రచారం పొందింది. ముఖ్యంగా శైలి ఎంతో ఆర్ద్రంగా, భక్తిని హృదయంలో పదిల పరిచే తీరులో ఉంది. ఈయన ‘కోదండ శతకం’, ‘గాంధీ శతకం’ కూడా రాశాడు. వరంగల్లు జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట నివాసి అల్లూరి రాజేశ్వరరావు సాహితీ మూల్యాలు తెలిసిన కవి. ఆయన కావ్యం, హరికథ, నాటకం, సుభాషితాలు వంటి ప్రక్రియల్లో మన్నికైన రచనలు చేశాడు. అట్లాగే, ‘వేదాద్రి నరహరి శతకం’, ‘వరదరాజు శతకం’, ‘అమరలింగ శతకం’, ‘విశ్వనాథ శతకం’ వంటి వైవిధ్యభరిత రచనలు వెలయించాడు. వరంగల్లు పట్టణవాసి ముదిగొండ వీరేశలింగశాస్త్రి (1940--1967) ‘అగస్త్యేశ్వర శతకం’ రాశాడు. ఇది ప్రయోగ ప్రయోజనాన్ని సాధించిన రచన. వస్తువులోనూ, అభివ్యక్తిలోనూ చదివించే గుణం ఇతోధికంగా ఉంది.
అనుముల పండరినాథశాస్త్రి ‘సంస్కృత శతకం’ రాశాడు. కాని, అది అలభ్యం. వారి వంశీయుడు అనుముల విశ్వనాథశాస్త్రి ‘వేణుగోపాల శతకాన్ని’ తెలుగులో రాశాడు. ముదిగొండ శంకరశాస్త్రి ‘శంకర శతకం’ వెలువరించాడు. సంప్రదాయాన్ని సమాదరించి నవీనంగా ఆకర్షణీయంగా, శక్తివంతంగా రాసి తన ప్రత్యేకతను చాటుకున్న పద్యకవి నల్లందిగళ్ చక్రవర్తుల రంయ్యాల లక్ష్మీనరసింహాచార్యులు (1884--1959) ‘ముకుంద శతకం’, ‘రమేశ శతకం’ రాశాడు. ఈ రెండూ విష్ణు పారమ్యమైనవే. తెలంగాణ సాహిత్య చరిత్రకు వన్నె తెచ్చిన ఒద్దిరాజు సోదరుల సాహితీ సమారాధనం మాటల కందనిది. వీరిలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు ‘లోకేశ్వర శతకం’ రాశాడు. కరీంనగర్ జిల్లా బుట్టారెడ్డిగూడెంకు చెందిన గొట్టుముక్కుల రాధాకిషన్‌రావు (1898) ‘రంగనాయక శతకం’, ‘శ్రీశైల మల్లికార్జున శతకాల’ను రాసి శైవ-వైష్ణవ తత్తాలను సమాదరించాడు. ఉత్తమ పరిశోధకుడు, సాహితీ మర్మజ్ఞుడు దూపాటి వేంకట రమణాచార్య (1892--1975) ‘రంగధామ శతకం’ వైష్ణవతత్త్వాన్ని ప్రకటించేది. వీరు వరంగల్ ప్రాంత సాహిత్య చరిత్రకు ముఖ్య కారకులు.
సాహితీమూర్తి ముదిగొండ శంకరాధ్యులు (1854-- 1924) ‘భావలింగ శతకము’, ‘మల్లికార్జున శతకము’లు రాశారు. వీటిలో సామాజికాంశాలు, ఆధ్యాత్మికతా ఉన్నాయి. ప్రతి పద్యంలోనూ గాఢత, ఆర్ద్రత తరగలెత్తుతుంది. వరంగల్లు జిల్లా పరకాలలోని పద్యకవి రాపాక వేంకటపతిశాస్త్రి (1905) ‘వేంకటేశ్వర శతకం’, ‘శ్రీరామ శతకం’, ‘కుంకుమేశ్వర శతకాల’ను రాసి శైవ-వైష్ణవ అభేదాన్ని ప్రకటించాడు. కవిరాజ చూడమణిగా పేర్గాంచిన ఉదయగిరి శేషగిరిరావు (1907--1965) గీర్వాణంలోనూ, తెలుగులోనూ చతురత ప్రదర్శించిన కవి. ఆయన లేఖిని నుండి ‘కేశవనాథ శతకం’, ‘శేషగిరిరామ శతకం’ హృదయ కోటికెక్కాయి. ‘వినగ దప్ప వెర్రి వెంగళప్ప’ (1973) అంటూ హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం వంటి గుణాలను ప్రతి పద్యంలోనూ ఒడిసి పట్టుకున్న కవి పల్లా రామకోటార్య (1911). ఈయన రాసిన ‘మానవ శతకం’, ‘ఆర్య శతకం’ అనేవి జన బాహుళ్యాన్ని అలరించిన రచనలు.
వరంగల్ జిల్లాలో జీడికల్ అనే పుణ్యక్షేత్రం ఉంది. అది రాముడు మారీచుణ్ని చంపిన ప్రదేశమంటారు. ఆ రామభద్రునిపై అనేక రచనలు వచ్చాయి. నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన కవి కేశవపట్నం నరసయ్య (1924) ‘జీడికంటి రామశతకం’ రాశారు. ఇందులో పారశీక, ఉర్దూ పదాలు బాగా చేరాయి. మధుర శైలితో సమకాలీన సంఘటనలను వింగడించారు. కాళోజీ వంటి కవులే గురువుగా భావించే గార్లపాటి రాఘవరెడ్డి గొప్ప తాత్త్వికత నిండిన ‘గోపికావల్లభా’ వంటి శతకాలు రాశారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవుల ప్రశంసపొందిన కవిత్వం వీరిది.
వరంగల్ జిల్లా ఇల్లందు గ్రామనివాసి అడ్లూరి రామకవి (1922) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వెలువరించిన ‘అన్నపూర్ణేశ్వరి శతకం’, ‘సీతారామశతకం’ బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. హైద్రాబాద్ నుంచి వెలువడిన ‘భాగ్యనగర్’ అనే పత్రికకు సంపాదకునిగా ఆయన పనిచేశారు. మడికొండ గ్రామవాసి మోతుకూరి మధుసూదన్ రావు (1924) ‘వేంకటేశ్వర శతకం’ రాశారు. సాహితీ లోక విఖ్యాతుడైన మోతుకూరి పండరినాథరావు వీరి పూర్వీకులు. ముస్లిం అయినా తెలుగులో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్న కవి గులాం నబీ (1935). ఆయన స్వగ్రామం శాయంపేట మండలం పెద్దకోడెపాక. సరళ శైలితో, చక్కని భావుకతను మేళవించి ‘మేలుకొలుపు’ పేర్న శతక రచన రాశారు.
కరీంనగరు జిల్లా పర్లపల్లిలో జన్మించిన తిరుకోవలూరు రామానుజస్వామి (1927) వైష్ణవ సంప్రదాయరీతిలో ‘శ్రీరామ శతకాన్ని’ (1984) రాశారు. ఆయన హనుమకొండ నివాసులు. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య (1933) శతక రచనలో అపూర్వమైన ప్రతిభను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ‘అంతర్మథనం’ పేరున శతకాన్ని రచించారు. శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రుల స్తుతి ప్రధానంగా ఉన్నప్పటికీ ఈ శతకం అపార కవితా మూల్యాలను అందిస్తుంది. తన ప్రియతమ సాహితీనేస్తం చేకూరి రామారావు షష్టిపూర్తి సందర్భంగా ‘చేరాకు శతమానం’ శతకం రాశారు. ఇందులో వర్తమాన సమాజంలోని చాలా విషయాల్ని ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. విమర్శలోనూ, అవధానంలోనూ మేటి, సాహితీ ఉత్తుంగ శిఖరం కోవెల సుప్రసన్నాచార్యులు కూడా చేతనావర్త కవుల్లో ఒక బలమైన కవి. వీరు ‘పాంచాలరాయ శతకం’ (1976) రాశారు. ఎవరూ ఎన్నుకోని అంశాన్ని అందుకొని శిల్ప నిర్మాణంలో నిపుణతను ప్రదర్శించి ప్రతి పద్యంలోనూ భారతీయాధ్యాత్మికతను, ఆరాధనా తత్పరత ప్రయోజనాలను నిక్షేపించి శతకాన్ని హృదయాభిరామం చేశారు.
శ్రీపెరంబుదూరు లక్ష్మణమూర్తి రాసిన ‘గోపికా వల్లభా!’ శతకం తెలుగు శతక సాహితీ జగత్తులో మణిపూస వంటిది. అవధాని డా. ఇందారపు కిషన్‌రావు రాసిన ‘శ్రీనివాస శతకం’ సంపూర్ణంగా శ్రీనివాసుని సంస్తుతితో కూడింది. కవితాభివ్యక్తిలో పూర్తిగా సంప్రదాయమే కనిపించే ఈ శతకం ఆలోచనామృతంగా ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రవాసి ఎన్.కె. పిళ్లే సమాజంలోని సమస్యలను ప్రస్తావిస్తూ ‘హే ప్రభో శతకము’, ‘చిత్రింపు పోకడల్’ (త్రిశతి) రాశారు. ఇందులో కరీంనగర్ జిల్లా జాతీయాల్ని, లోకోక్తుల్ని విరివిగా వాడారు. తెలుగు సంస్కృత భాషలలో కపిలవాయి లింగమూర్తి నిష్ణాతులు. ‘తిరుమలేశ శతకము’, ‘పండరినాథ విఠల శతకము’ (1972), ‘దుర్గా భర్గ శతకము’ (1984), ‘ఆర్యాశతకము’ (1978) వీరి ప్రముఖ శతక రచనలు. అలంకార, ఛందో శాస్త్రాలను ఔపోసన పట్టిన వారవడం వల్ల వీరి రచనల నిండా అనేక ఛందోమర్మాలు నిక్షిప్తాలైనాయి. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు వాసి.
సంస్కృతాంధ్రాలలో మహాపండితులు అష్టకాల నరసింహరామశర్మ ’రామ ప్రభో శతకము’ (1994), ‘సారస్వతీం భావయే’ (1995) శతక రచనలను ప్రతిభావంతంగా అందించారు. వరంగల్ జిల్లా జిన్నూరు శాయంపేటలో జన్మించిన ఆరుట్ల భాష్యాచార్యులు శైవ వైష్ణవ భేదం లేకుండా శతక సాహిత్యాన్ని పండించారు. ‘ఇలువేల్పు- శ్రీ మందరగిరి వేంకటేశ్వర శతకము’, ‘కల్హార హారము’, ’శ్రీ సప్తగిరీశ్వర శతకము’, ‘శ్రీ గుట్ట రాజేశ్వర శతకము’ పేరున శతకాలు రాశారు.
కసిరెడ్డి వెంకటరెడ్డి ‘గాంధీతాత శతకం’ (1971), ‘శ్రీ నరసింహ శ్రితార్ధి భంజనా!’, ‘పిట్సు భరధీశ! వెంకటేశ!’ (1975), ‘మత్తకోకిల’ వృత్తాలతో శతకం రాయడం ఆయన ప్రయోగశీలతకు నిదర్శనం. శతక రచనలోనూ ప్రయోగాలు చేస్తున్న కవులు రసాభిరామమైన శతకాలు రాయడం కన్పిస్తుంది. డా. రాళ్ళబండి కవితాప్రసాద్ వరంగల్ భద్రకాళీ మాత ఆలయంలో సరికొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. దేవి ఎదురుగా కూర్చుని ‘వరంగల్ పాలికా! కాళికా!!’ అనే మకుటంతో ‘భద్రకాళీ శతకం’ ఆశువుగా చెప్పారు. ఇందులో 50 పద్యాలు పృచ్ఛకులు అడిగిన అంశాలను పూరిస్తూ చెప్పారు.
మిగతా పద్యాలను ఆయనే స్వయంగా ఇతివృత్తాలను ఎన్నుకొని చెప్పారు. తెలుగు సాహితీ చరిత్రలో ఇదొక వినూత్నమార్గం, అపూర్వం, ఈ కవి రాసిన ‘కాదంబిని’ శతకం గొప్ప సంచలనాన్ని సృష్టించింది. తెలంగాణా ప్రాంతంలో శతక కవులతోపాటు కవయిత్రులు కూడా చాలామందే ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మీనరసమ్మ ‘భక్తవత్సలా శతకం’, రూబానుపేట రత్నమ్మ ‘వెంకటరమణ శతకం’, ‘శ్రీనివాస శతకం’, పొన్నూరు హైమవతి ‘తెలుగుపట్టి’, మంథెన ఆండాళ్ ‘యువతీ శతకము’లను రాశారు. వీటిలో మాతృహృదయం మానవతా విలువలు చక్కగా ద్యోతకమవుతాయి.
తెలంగాణ ప్రాంతంలోని స్థలాలపైనా శతకాలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, మఠంపల్లి శ్రీ నరసింహక్షేత్రం, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, నాంపల్లి, కొండగట్టు, ధర్మపురి, కొత్తకొండ, వరంగల్ జిల్లాలోని జీడికల్లు, హవేలీ శాయంపేట, రంగారెడ్డి జిల్లా చిలుకూరు, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు, ఖమ్మం జిల్లా గుంటుమల్లన్న, భద్రాచలం, మెదక్ జిల్లా వీరెంగూడెం మల్లన్న, ఆదిలాబాద్ జిల్లా బాసర క్షేత్రం వంటి ప్రదేశాలు శతకాల రచనలకు ప్రేరణనిచ్చాయి.
అంతేగాక పూర్వ తెలంగాణలోని జటప్రోలు, గద్వాల వంటి సంస్థానాలు కూడా పండిత లోకాన్ని సమాదరించి శతక సాహిత్య వికాసానికి దోహదపడ్డాయి. సంస్థాన ప్రాంతాలలో కవి పండిత వంశాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఆశయాలు, అభిప్రాయాలు, భక్తి తత్పరతలు శతక రూపాల్ని ధరించి అనంతర తరాలకు పాథేయంగా నిలిచాయి. కొందరు నిరంకుశ పాలకుల పాలనలు కూడ శతక వికాసానికి చేయూతనిచ్చాయి. అమానుష చర్యల్లో నలిగిపోతున్నా సమాజం ఆక్రందన శతకంగా వెలువడింది.
అవీ వస్తు వైవిధ్యంలో అనంతర ఉద్యమాలకు మార్గాన్ని చూపే విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా నిజాం ప్రజల గుండెలమీద ఉక్కు కత్తులను ఝళిపించిన విపత్కర పరిస్థితులను ఎండగడుతూ శతకరచన సాగింది. వీటిలో చాలావరకు బాధితుల ఆవేదన భగవంతునికి నివేదించడం కూడా జరిగింది. అంతేగాక, శతకం రాస్తేనే జీవితం సఫలమవుతుందనే నమ్మకం కూడ శతక రచనకు ప్రేరణనిచ్చింది. ఇందుకు పోతన, కూచిమంచి తిమ్మకవి రచనలే సాక్ష్యాలు. తెలంగాణలో పాల్కురికి సోమన్న కలం నుండి సమగ్ర స్వరూపాన్ని సంతరించుకున్న శతకం నేటికీ తెలుగు సాహిత్య ప్రక్రియగా సజీవమైంది. శతక ప్రక్రియ నేటివరకు తెలంగాణలో విశేష రచనలు వెలువడడానికి చక్కని స్పందననిస్తూనే ఉంది.
ఎందరో, ఇంకెందరో..
తెలంగాణలో శతకకవులు లెక్కకు మిక్కిలి ఉన్నారు. రోజురోజుకూ ఈ ప్రాంతంలో ఎక్కడో ఒకచోట ఒక శతకం వెలువడుతూనే ఉన్నది. వారిలో కొందరిని ఇక్కడ పేర్కొనడం బాగుంటుందేమో. అందె వేంకటరాజం ‘ఈశ్వర శతకం’, రాపోలు సత్యనారాయణ ‘డమరుక లయ’, జె. మురళీధరకవి ‘అంకుల్రావు శతకం’, ముదిగొండ మల్లికార్జున కవి ‘రాజేశ్వర శతకం’, ముదిగొండ విశ్వనాథ కవి ‘సోమశేఖర శతకం’, గన్ను ఉపేందర్ ‘తెలంగాణా శతకం’, నర్సింగోలు లక్ష్మయ్య ‘సూక్తిసుధ’, డా. ఆచార్య తిరుమల ‘విశ్వవిభూతి- శ్రీకాశీ విశ్వనాథ శతకము’, బండారి లక్ష్మీరాజం ‘శ్రీపురుషోత్తమ శతకం’, చల్లా లక్ష్మయ్య ‘శ్రీశ శతకము’, కలువకుంట కృష్ణమాచార్య ‘శ్రీకొండగట్టు ఆంజనేయ శతకం’ శ్రీపెరంబుదూరు రాఘవాచార్యులు ‘చందుపట్ల పుర సీతారామశతకం’, సముద్రాల వేణుగోపాలాచార్య ‘శ్రీ సప్తగిరి వేంకటేశ్వర శతకము’, డా. సి.వి. జయవీరరాజు ‘శ్రీ కొండగట్టు హనుమభక్తి శతకము’, డా. కావూరు పాపయ్య శాస్త్రి ‘శ్రీ పులిగొండ లక్ష్మీనృసింహ మధ్యాక్కరలు’, డా. వడ్లూరి ఆంజనేయరాజు ‘శ్రీ ఆంజనేయ శతకము’, ఉత్పల సత్యనారాయణాచార్య ‘ఉత్పలమాల’, మంథెన రంగనాయకమ్మ ‘శ్రీరఘునందన శతకం’, ఆచార్య ఫణీంద్ర ‘ముకుంద శతకం’, డా. వజ్జల రంగాచార్య ‘భార్గవి’ శతకం, ‘కల్యాణ మాగాధిపా!’ శతకం, బుర్రా నర్సయ్య ‘స్వాతంత్య్ర సమరయోధా జోహారు’ ముడుంబై వరదాచార్య ‘వరదరాజ శతకం’, డా. ఆయాచితం నటేశ్వరశర్మ ‘నవ్యనీతి శతకం’, సూర్యదేవర సుందరయ్య ‘శ్రీ రామామృత శతకము’, తిరునగరు జగన్మోహన్ ‘వేదవాస శతకము’, శంకరమంచి శ్యాంప్రసాద్ ‘సత్యవాణి శతకం’, తోకల రాజేశం ‘తెలుగు బాల శతకం’.. ఇట్లా అసంఖ్యాకమైన శతకాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రజల రసనల మీద ఆడుతునూ ఉన్నాయి.
రచనా కాలం: 2012