హైదరాబాద్: 2023 మార్చితో ముగిసిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్ డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని, రెవెన్యూ రాబడుల వృద్ధి ఒక శాతం తగ్గిందని పేర్కొంది. సొంతపన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగిందని చెప్పింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 2,06,977 కోట్లకు పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది.
రూ. 2,749 కోట్ల మేర ద్రవ్యలోటె తక్కువ చేసి చూపించారని వెల్లడించింది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చినరుణాలు, అడ్వాన్స్ లు 150 శాతం పెరిగాయని పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని, 2022-23 లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ. 1,18,629 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ. 17,829 కోట్లు అందించిందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని సూచించింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు రాలేదని వెల్లడించింది. ఇళ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ పామ్ పథకాల నిధులు, దళితబంధు,రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదని తెలిపింది.