calender_icon.png 5 March, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీకి తెలంగాణ వనరులు

10-12-2024 01:04:27 AM

  1. దోచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ కుట్ర 
  2. అసెంబ్లీకి వెళ్లకుండా ఆపడం అప్రజాస్వామికం   
  3. శాసన సభ గేటు వద్దే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్  
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): తెలంగాణ వనరులను అదానీకి దోచిపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలకు పాల్ప డుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అదానీని వ్యతిరేకిస్తున్నదని అన్నారు. రేవంత్, అదానీ ఆపవిత్ర కలయిక, దోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టంచేశారు.

రేవంత్ బొమ్మలున్న టీషర్టులతో సోమవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దనే నిర సన వ్యక్తంచేశారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. అంతకుముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. 

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్నట్టు నాటకాలు ఆడుతూ తెలంగాణలో ప్రాజెక్టులను, వనరులను అదానీకి దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను ఎండగడుతామని చెప్పారు.

బలవంతంగా భూములు గుంజుకుంటున్న వారి పక్షాన పోరాడుతూనే ఉంటామని, వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే రోడ్డు మీద నిలబెట్టారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాహుల్, ప్రియాంకతోపాటు 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ తెలంగాణలో అసెంబ్లీ లోపలికి వెళ్లొద్దా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు సమాధానం చెప్పే దద్దమ్మలు పోలీసులను అడ్డంపెట్టుకొని తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ, కౌన్సిల్ లోకి అడుగుపెట్టకుండా చూస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ దీక్ష చేయకుంటే డిసెంబర్ 9న ప్రకటన రాకుంటే తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఉండేవా? అని ప్రశ్నించారు. స్పీకర్ ఆదేశాలు లేకుండా శాసనసభ హక్కులకు కాలరాస్తూ అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్న తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించడంపై నిప్పులు  చెరిగారు. 

తెలంగాణ అస్తిత్వంపై జరిగే దాడి 

ప్రభుత్వ నిరంకుశత్వం, తెలంగాణ అస్థిత్వంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపామని తెలంగాణ భవన్‌లో నిరసన కార్యక్రమంలో కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి, అదానీ సంబంధాలపై కాంగ్రెస్ మౌనం వహించిందని, రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పంపిస్తున్న డబ్బు సంచులే అందుకు కారణమని ఆరోపించారు.

రేవంత్ అదానీ బంధంపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా ప్రజల్లో మట్టిగొట్టేందుకు రామన్నపేటలో వేల ఎకరాలను అదానీకి ధారాదత్తం చేసేందుకు ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసిందని మండిపడ్డారు.

రేవంత్ విధానాలు, అరాచకపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ నిర్బంధాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.