calender_icon.png 22 January, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

66:34పె తెలంగాణ నిరసన

22-01-2025 02:10:56 AM

కేఆర్‌ఎంబీలో కృష్ణానది నీటి కేటాయింపులపై చర్చ

  1. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటుచేయాలి
  2. కేఆర్‌ఎంబీని విజయవాడకు తరలించాలన్న ఏపీ
  3. చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో సమావేశం

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): కృష్ణా నదీ జలాల్లో 66:34 నిష్పత్తి వాటా సరికాదని, దానిని కనీ సం 50ః5ం నిష్పత్తిలోనైనా కేటాయింపులు చేయాలని, 11 ప్రాంతాల్లో టెలి మెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాల ని తెలంగాణ కోరింది. హైదరాబాద్ జలసౌధలో మంగళవారం కేఆర్‌ఎంబీ చైైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు సమావేశం జరిగింది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో 29 అంశాలతో కూడిన ఎజెం డాపై కీలకంగా చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ నీటి వాటాల పంపిణీ, ప్రాజెక్టుల స్వాధీనం, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు తదితర అంశాలపై కీలకంగా చర్చించారు.

ప్రాజెక్టులను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నారంటూ రెండు రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై కూడా మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, శ్రీశైలం రైట్ కెనాల్, ఆర్డీఎస్ రైట్ కెనాల్ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎలాంటి కేటాయింపులు లేకుండానే నీటిని మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు ఉన్న చోట కేటాయింపులకు మించి కృష్ణానీటిని తరలించు కుపోతున్నారని, అందుకే 11 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అప్పుడు ఎంత నీటిని తరలించుకుపోతున్నా రో తెలుస్తుందని పేర్కొన్నారు. గతంలో ఏర్పా టు చేసిన టెలిమెట్రీ వ్యవస్థలను ధ్వంసం చేసి నీటి దోపిడీ తెలియకుండా చేస్తున్నారని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తీసుకుపోయారు. పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట కొడంగల్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతోపాటు కల్వకుర్తి లిఫ్టు సామర్థ్యం పెంపు సహా జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.

ఈ ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు ఉన్నాయని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. నాగార్జునసాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ అధికారులు కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని కూడా ప్రస్తావించారు. డ్యామ్ స్లూయిస్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తామని కేఆర్‌ఎంబీ హామీ ఇచ్చింది. కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరా వు కోరారు.

హైదరాబాద్‌లో ఇస్తున్నట్టుగానే అక్కడ కూడా కార్యాలయానికి ఉచిత వసతి ఇవ్వాలని బోర్డు చైైర్మన్ సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ డ్యాం నిర్వహణ, టెయిల్ పాండ్‌లోని 4 టీఎంసీల నీటి వినియో గం, శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మత్తులు, ఆర్డీఎస్ ఆధునీకరణ, విద్యుత్ ఉత్పత్తి, సాగర్ ఎడ మ కాలువ నష్టాలు, క్రాస్ లెవెల్స్ తదితర అం శాలు ప్రస్తావనకు వచ్చాయి.

ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, బోర్డు మెంబర్ సెక్రటరీ రాయిపురే, ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు.

కేటాయింపులపై నిరసన తెలిపాం: రాహుల్ బొజ్జా

కృష్ణానదీ జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపామని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా వెల్లడించారు. 66:34 నిష్పత్తిని కొనసాగిస్తూనే పరిస్థితులను బట్టి పెంచే ప్రయత్నం చేస్తామని కేఆర్‌ఎంబీ చైైర్మన్ తెలిపారని చెప్పారు. సమావేశం అనంతరం రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడారు. కేటాయింపులు, అనుమతులు లేకుండానే ఏపీ కృష్ణా నదీ జలాల ను మళ్లిస్తున్న విషయాన్ని ప్రస్తావించామని తెలిపారు.

తెలంగాణలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 71 శాతం ఉందని, అందుకే పరీవాహక ప్రాంతంలో 71శాతం మేరకు వాటా ఇవ్వాలని బొజ్జా అన్నారు. అంతవరకూ కనీసం ఇరు రాష్ట్రాలకు సగం సగం కేటాయించాలని సూచించారు. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరామని, టెలిమెట్రీ కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో స్పందిస్తామని ఆ రాష్ట్ర ఈఎన్సీ చెప్పారని వెల్లడించారు.