calender_icon.png 20 March, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పురోగమనం!

20-03-2025 01:26:42 AM

  1. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రం 
  2. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో భారీగా విస్తరణ
  3. ఐటీ రంగంలో 9.46 లక్షల మంది ఉద్యోగులు 
  4. ఎగుమతుల్లో దేశంలో 8వ స్థానం
  5. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఎక్కువ 
  6. గణనీయంగా పెరుగుతున్న పంటల ఉత్పత్తి
  7. సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2025లో వెల్లడి 
  8. బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలంగాణ అర్ధ, గణాంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ -2025 వెల్లడించింది. బుధవారం బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

ఇందులో వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో తెలంగాణ ఎలా అభివృద్ధి పథంలో సాగుతుందో గణాంకాలతో ఉదహరించారు. దీంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటు, వ్యవసాయంతోపాటు ఆయా రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం, చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు పొందుపర్చారు. తెలంగాణలో తలసరి ఆదాయం కూడా గణనీయంగా వృద్ధిని నమోదు చేస్తున్నట్టు ఔట్‌లుక్ వెల్లడించింది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 10.1 శాతం వృద్ధి..

 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముందస్తు అంచనాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జీఎస్‌డీపీ) రూ.16,12,579 కోట్లుగా తేల్చారు. ఇది గతేడాదితో పోల్చుకుంటే 10.1 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే సమయంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కేవలం 9.9 శాతం వృద్ధి చెందింది. 

జిల్లా స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి

స్థూల ఉత్పత్తిలో జిల్లాల వారీగా చూసుకుంటే..రంగారెడ్డి జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది.  ఈ జిల్లాలో రూ.3,17,898 స్థూల ఉత్పత్తి నమోదైంది. స్థూల ఉత్పత్తిలో టాప్ జిల్లాల్లో రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ (రూ.2,57,949), మేడ్చల్ మల్కాజిగిరి (రూ.1,04,710), సంగారెడ్డి (65,190), నల్గొండ (రూ.53,771) ఉన్నాయి.

ఈ జిల్లాల్లో పరిశ్రమలు, సేవల రంగం విస్తారంగా ఉండటంతో జిల్లా స్థూల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అతి తక్కువ జిల్లా  స్థూల ఉత్పత్తి ఉన్న జిల్లాల్లో ములుగు రూ.8,873తో దిగువన ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి (రూ.12,932), కుమ్రంభీం ఆసిఫాబాద్ (రూ.13,700), నారాయణపేట(రూ.13,818), రాజన్న సిరిసిల్ల (రూ.13,981) జిల్లాలు దిగువన ఉన్నాయి.

లక్ష కి.మీ.పైగా రోడ్లు..

రాష్ట్రంలో మొత్తం 1,11,775.56 కి.మీ. రోడ్లు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డి (7,932.14 కి.మీ), నల్గొండ (7,766.92 కి.మీ) అగ్రస్థానంలో ఉన్నాయి.

నిరుద్యోగం  కాస్త ఎక్కువే..

రాష్ట్రంలో నిరుద్యోగం రేటు దేశంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగానే ఉంది. 2023-24లో చూసుకుంటే తెలంగాణలో నిరుద్యోగం రేటు 5.1 శాతం ఉండగా.. దేశ వ్యాప్తంగా ఇది 3.5 శాతం మాత్రమే కావడం గమనార్హం. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాలను పరిశీలిస్తే.. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 3.8 శాతం ఉండగా.. దేశవ్యాప్తంగా ఇది 2.8 శాతంగా ఉంది. అదే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం తీసుకుంటే తెలంగాణలో 7.6 శాతం కాగా.. దేశ వ్యాప్తంగా 5.4 శాతం నమోదయ్యింది. అంటే పట్టణ ప్రాంతంలోనే నిరుద్యోగం రేటు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

మొత్తం అప్పులు రూ. 7.38 లక్షల కోట్లు..

రాష్ట్ర అప్పుల విషయానికి వస్తే.. మొత్తం అప్పులు రూ. 7,38,707 కోట్లు ఉన్నట్టు సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2025లో స్పష్టంగా పేర్కొంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు, చెల్లించాల్సినవి (28.2.2025 నాటికి) రూ. 4,37,223 కోట్లు ఉండగా.. ప్రభుత్వం గ్యారెంటీలుగా ఎస్‌పీవీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న రుణాలు రూ.1,17,109కోట్లు ఉన్నాయి.

అలాగే ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటూ ఎస్‌పీవీ, పీఎస్‌యూలు సొంతంగా తీసుకున్న రుణాలు రూ.1,24,419 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్‌పీవీలు, కార్పొరేషన్లు, సంస్థలు గ్యారెంటీలు లేకుండా తీసుకున్న రుణాలు రూ.59,956 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రాష్ట్ర మొత్తం అప్పులు రూ.7,38,707 కోట్లు ఉన్నట్టుగా అందులో పేర్కొంది.

తగ్గుతున్న భూకమతాల విస్తీర్ణం..

రాష్ట్రంలో భూకమతాల విస్తీర్ణం తగ్గిపోతుండటం గమనార్హం. చిన్న, సన్నకారు, దిగువ మధ్యస్థ, మధ్యస్థ, పెద్ద స్థాయిలో భూ కమతాలను సాగు చేస్తున్న రైతులు ఉన్నప్పటికీ.. యేటికేడాది చిన్న, సన్నకారు రైతుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. మధ్య, దిగువ మధ్యస్థ రైతుల సంఖ్య రోజుకోజుకూ తగ్గిపోతున్నట్టు 2021-22లో చేసిన 11వ వ్యవసాయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

2021-22లో సన్నకారు రైతులు సాగుచేస్తున్న భూకమతాలు (2.47 ఎకరాలకన్నా తక్కువ) 48.47 లక్షలు ఉండగా, చిన్నకారు రైతులు (2.48 ఎకరాల నుంచి 4.94 ఎకరాల వరకు) 16.00 లక్షల మంది ఉన్నారు. అలాగే దిగువ మధ్యస్థ (4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాల వరకు) సాగు చేస్తున్న రైతుల సంఖ్య 5.05 లక్షలు మాత్రమే.

ఇక మధ్యస్థ సాగు చేస్తున్న (9.89 ఎకరాల నుంచి 24.77 ఎకరాల వరకు) రైతుల సంఖ్య కేవలం 99 వేలు మాత్రమే. పెద్ద భూస్వాములు (24.78 ఎకరాలకుపైగా..) 9 వేల మంది మాత్రమే ఉన్నట్టు ఈ ఔట్‌లుక్‌లో తెలిపారు.

అయితే.. 2015-16తో పోల్చితే.. సన్నకారు రైతుల సంఖ్య 38.40 లక్షల నుంచి 48.47 లక్షలకు పెరగడం గమనార్హం. అంటే తమ అవసరాలకు భూములకు అమ్ముకోవడం.. లేదా వివిధ ప్రాజెక్టుల్లో భూములను కోల్పోవడంతో మధ్యస్థ, దిగువ మధ్యస్థ రైతులు కాస్తా సన్నకారు రైతుల జాబితాలోకి చేరినట్టు చెప్పుకోవచ్చు.

అలాగే చిన్నకారు రైతుల సంఖ్య 2015-16లో 14.09 లక్షల మంది ఉండగా.. 2021-22 నాటికి 16.00లక్షలకు పెరిగారు. ఇదే సమయంలో దిగువ మధ్యస్థ రైతుల సంఖ్య 5.64 లక్షల నుంచి 5.04 లక్షలకు తగ్గారు. అలాగే మధ్యస్థాయి రైతులు 1.26 లక్షల నుంచి 99 వేలకు తగ్గడం గమనార్హం.

పశుసంపదలో మనవంతు 6.09 శాతం

దేశ వ్యాప్తంగా ఉన్న పశు సంపదలో మన రాష్ట్రంలో 6.09 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పశువులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, గాడిదలు, ఒంటెలు ఇలా అన్ని పశువులు కలుపుకుంటే రాష్ట్రంలో 3 కోట్ల 26 లక్షల 39 వేలు ఉండ గా.. దేశవ్యాప్తంగా 53 కోట్ల 58 లక్షల 22 వేల పశు సంపద ఉంది. అంటే దేశ పశుసంపదలో మన రాష్ట్రంలో ఉన్నది 6.09 శాతం. పౌల్ట్రీ విషయానికి వస్తే.. దేశంలో మొత్తం 85 కోట్ల 18 లక్షల 10 వేల పౌల్ట్రీ (కోళ్లు) ఉండగా.. ఇందులో 7 కోట్ల 99 లక్ష ల 99 వేలు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది దేశం మొత్తంలో 9.39 శాతంగా పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈలే భారీగా..

రాష్ట్రంలో పరిశ్రమలు శరవేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పరిశ్రమల్లో సూక్ష్మపరిశ్రమల శాతం 67.23 ఉండగా.. ఇందులో పెట్టుబడి 1.70 శాతమే. కానీ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మాత్రం 24.97 శాతం కావడం గమనార్హం.

అలాగే చిన్న తరహా పరిశ్రమలు 26.26 శాతం ఉండగా.. ఇందులో పెట్టుబడులు 12.06 శాతం, ఉద్యోగుల శాతం 27.74 గా ఉంది. మీడియం పరిశ్రమల శాతం 2.95 కాగా.. ఇందులో పెట్టుబడుల శాతం 11.28, ఉద్యోగుల శాతం 12.25 మాత్రమే.

పెద్ద పరి శ్రమల శాతం 2.60 ఉంటే ఇందులో పెట్టుబడులు 22.41 శాతం, ఉద్యోగుల శాతం 12.05గా ఉంది.  మెగా పరిశ్రమలు 0.96 శాతం ఉంటే ఇందులో పెట్టుడులు 52.55 శాతం కాగా.. ఇందులో పనిచేసే ఉద్యోగుల శాతం 22.99 కావడం గమనార్హం. 

అటవీ విస్తీర్ణం.. 

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మెల్లిగా పెరుగుతోంది. మొత్తం విస్తీర్ణంలో (2023 సర్వే ప్రకారం) అటవీ విస్తీర్ణం 27,688 చదరపు కి.మీ. అంటే మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో ఇది 24.69 శాతం. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న చత్తీస్‌గఢ్ (44.25 శాతం), ఒడిశా (39.31 శాతం) తర్వాత తెలంగాణ ఉంది. జాతీయ సగటు అటవీ విస్తీర్ణం 23.59 శా తం మాత్రమే.

అంటే జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం కాస్త మెరుగ్గానే ఉంది. ఇక జిల్లాల విషయానికి వస్తే.. ములుగు జిల్లా (64.64 శాతం) అటవీ విస్తీర్ణంతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం (41.38), జయశంకర్‌భూపాలపల్లి (41.15), మంచిర్యాల (41.09), కుమ్రంభీం ఆసిఫాబాద్ (40.24) ఉన్నాయి.

అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లాగా కరీంనగర్ (2.29 శాతం) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జోగులాంబ(2.32), హన్మకొండ (3.40), వరం గల్ (3.53), జనగామ (4.44) దిగువ ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 9 వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, టైగర్ రిజర్వ్‌లు ఉండగా.. వీటి పరిధి 5,672.87 చదరపు కి.మీ.గా ఉంది.

గణనీయంగా తగ్గిన ద్రవ్యోల్బణం రేటు..

గడిచిన పది నెలల్లో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా తగ్గిందని సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్-2005 స్పష్టం చేస్తోంది. 2024 ఏప్రిల్‌లో జాతీయస్థాయిలో ద్రవ్యోల్బణం 4.8 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 5.7 శాతంగా ఉంది. అంటే జాతీయ ద్రవ్యోల్బణం కంటే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్టుగా నమోదయ్యింది.

అదికాస్తా నెలలు గడుస్తున్నకొద్దీ 2025 జనవరి నాటికి 2.2కు వచ్చింది. అదే సమయంలో జాతీయ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా ఉంది. అంటే కేవలం పది నెలల్లో ద్రవ్యోల్బణం రేటు రాష్ట్రంలో 5.7 నుంచి 2.2 శాతానికి తగ్గగా.. దేశంలో ద్రవ్యోల్బణం 4.8 నుంచి 4.3 శాతానికి మాత్రమే తగ్గిందని అర్థమవుతోంది.

ఎగుమతుల్లో టాప్

రాష్ట్రంలో మొత్తం 24,112 పరిశ్రమలు ఉండగా.. ఇందులో మొత్తం రూ.1,29,332 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో 6,60,428 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసే రాష్ట్రాల్లో తెలంగాణకూడా టాప్-10లో ఉండటం గమనార్హం. అగ్రస్థానంలో గుజరాత్ 30.74 శాతం ఎగుమతులతో ఉండగా.. తెలంగాణ 3.21 శాతం ఎగుమతులతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్న పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, పార్టుల శాతం 30.66 శాతం ఉన్నాయి. ఈ ఎగుమతుల విలువ రూ. 30,742 కోట్లు. ఫార్మా ఎగుమతులు రూ.26,077 కోట్లు కాగా.. వీటి శాతం 26.01.

ఆ తర్వాతి స్థానంలో ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రికల్ యంత్రాలు, ఎక్విప్‌మెంట్,  న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రధానంగా అమెరికా, యూఏఈ, చైనా, సౌదీ అరేబియా, కువైట్, యూకే, జర్మనీ, రష్యా, బంగ్లాదేశ్, కెనడా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.

    ‘తలసరి’లో రంగారెడ్డి టాప్..

    ప్రస్తుత ధరలతో చూసుకుంటే.. 2024-25లో తెలం గాణలో తలసరి ఆదాయం రూ.3,79,751గా ఉంది. గతేడాదితో పోల్చుకుంటే 9.6 శాతం తలసరి ఆదాయం పెరగడం గమనార్హం. గతేడాది 2023-24 (ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్)లో తెలంగాణ తలసరి ఆదాయం 3,46,457గా ఉంది. అదే జాతీయ తలసరి ఆదాయం చూసుకుంటే.. రూ.1,88,892 నుంచి రూ.2,05,579 కి మాత్రమే పెరగడం గమనార్హం.

    జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా (రూ.10,55,913) అగ్రస్థానంలో ఉం ది. ఆ తర్వాత నాలుగు స్థానాల్లో హైదరాబాద్ (రూ.5,54,105), సం గారెడ్డి (రూ.3,45,478), మేడ్చల్ మల్కాజిగిరి (రూ.3,43,130), భద్రా ది కొత్తగూడెం (రూ.3,21,291) ఉన్నా యి.

    అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లాల్లో వికారాబాద్ (రూ. 1,98,401) చివరి స్థానంలో ఉండగా.. దిగువన ఐదు స్థానాల్లో హన్మకొండ (రూ.1,99,490), జగిత్యాల (రూ.2,05,273), నారాయణపేట (రూ.2,07,784), మహబూబ్‌నగర్ (రూ.2,12,232) ఉన్నాయి. 

    విద్యుత్ స్థాపిత శక్తి..

    రాష్ట్రంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి 26,212 మెగావాట్లకు చేరుకుంది (2025 జనవరి నాటికి). ఇందులో 14,602 మెగావాట్లు థర్మల్ విద్యుత్, 11,399 మెగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీ (ఇందులో జల విద్యుత్, సౌర, పవన విద్యుత్‌తో పాటు త్వరలో అందుబాటులోకి రానున్న 2,474 మెగావాట్లుకూడా ఉంది), 211 మెగావాట్లు న్యూక్లియర్ ఎనర్జీ ఉన్నాయి.

    రాష్ట్రంలో మొత్తం 1,90,61,511 విద్యుత్ వినియోగదారులున్నారు. ఇందులో 71.9 శాతం గృహ కేటగిరి వినియోగదారులే. అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తుండటం తో రోజురోజుకూ వినియోగం పెరుగుతూ వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ డిమాండ్ 16,897 మెగావాట్లు.

    అలాగే గరిష్ఠ విద్యుత్ వినియోగం 322.23 మిలియన్ యూనిట్లు. గడిచిన 15 నెలల కాలంలోనే 400 కేవీ నుంచి 132 కేవీ వరకు 4 సబ్ స్టేషన్లు , 620 సర్క్యూట్ కి.మీ మేర 15 కొత్త లైన్లు వేసి, 31 సబ్ స్టేషన్లలో 1681.5 ఎంవీఏ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నారు.

      సేవల రంగానిదే కీలక భాగస్వామ్యం..

      రాష్ట్రంలో సేవల రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రస్తుత ధరలతో చూసుకుంటే 2024-25లో (అడ్వాన్స్ ఎస్టిమేట్స్) రూ.9.83,529 కోట్ల స్థూల రాష్ట్ర ఉత్పత్తి సేవల రంగం నుంచే వస్తోంది. సేవల రంగం 11.9 శాతంతో వృద్ధి చెందుతోంది. ఇందులో రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్స్ సేవలు,  వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజీ, కమ్యూనికేషన్లు, సేవలు ముఖ్యమైనవి.

      2025లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో  తెలంగాణకు రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు రాగా.. ఇందులో సేవల రంగానికి రూ.1,04,500 కోట్లు ఉండటం.. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో సేవల రంగం విస్తరణను స్పష్టం చేస్తోంది. ఐటీ రంగాన్ని పరిశీలిస్తే.. 2023-24లో ఐటీ ఎగుమతులు రూ.2,68,233 కోట్లు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 9,46,285. హైదరాబాద్ ఐటీ సేవలకు మారుపేరుగా మారింది. ఏఐ, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, యానిమేషన్ తదితర అంశాలపై హైదరాబాద్ తన పట్టు నిలుపుకుంటోంది. 

      1. పంటల ఉత్పత్తి పెరిగింది..

      రాష్ట్రంలో వ్యవసాయం పండగలా సాగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో.. రోజురోజుకూ పంటల ఉత్పత్తికూడా పెరుగుతోంది. 2023-24లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 207.95 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ఇదికాస్తా 2024-25 (సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్) ప్రకారం 214.32 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి.

      అలాగే పప్పు ధాన్యాల విషయంలోనూ 3.61 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 4.28 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగినట్టు ఔట్‌లుక్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా వరి 174 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 179 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగ్గా.. పత్తి 26 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.