తెలంగాణ బతుకు నిండా కష్టాలు, కన్నీళ్లే.. గుండెల నిండా గాయలే. ఆ వెతలే కథలైతే..? గాయాలే గేయాలైతే? బొమ్మ బ్లాక్‌బస్టరే! కన్నీళ్లన్నీ ఆనంద బాష్పాలే!! ఔను, సరిగ్గా అదే జరిగింది. తెలంగాణ సినీ బలగం సత్తా చాటింది. తెలంగాణ ఆచారం సంప్రదాయాల తీరుతెన్నుల్ని అందమైన కథగా తెర మీదకు తీసుకు రావటం ద్వారా దాదాపు అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల దృష్టినీ తమ వైపు తిప్పుకోగలిగారు. తెలంగాణ ఆచార సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలు ఎంతటి ఘనత వహించాయో కదా..! అంటూ అందరూ చెప్పుకొంటుంటే వింటూ ఆనంద పడుతున్న ఆ చిత్రబృందాల సంతోషం రెట్టింపయింది.. తెలంగాణ దర్శక రత్నాల కీర్తి కిరీటంలో కలికి తురాయి లాంటి ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డులు’ చేరటమే ఈ రెట్టింపు ఆనందాలకు కారణం!
‘69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌బె వేడుకలో అవార్డుల మోత మోగించిన సినిమాలు రెండూ ‘తెలంగాణకు ప్రత్యేకం. అందులో ఒకటి ‘బలగం’ చిత్రం కాగా, రెండో మూవీ ‘దసరా’. ‘బలగం’ సినిమా కథ తెలంగాణ ఆచారానికి సంబంధించినదైతే, యావత్తు తెలంగాణ పెద్ద పండగగా చెప్పుకొనే ‘దసరా’ పండుగ పేరు ఓ సినిమాకు టైటిల్ కావటం. విజయ దశమి పేరుతో భారతదేశమంతా జరుపుకొంటున్నప్పటికీ ఇక్కడి ప్రజలు.. దసరా నాటి ఆనవాయితీని పోగొట్టకుండా ఉన్నంతలోనే కొత్త బట్టలు కొనుక్కొని మరీ పండుగను వెల్లదీస్తారు. అలా తెలంగాణ ఆచార సంప్రదాయాలతో ముడిపడి ఉన్న రెండు సినిమాలూ ఒకే ఏడాది రావటం, ఒకే దఫా అవార్డులు పొందటం యాదృశికమే.
తెలంగాణ దర్శక రత్నాలు..
తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను తమ ఖాతాలో వేసుకున్న రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన వారు తెలంగాణ ముద్దులు కావటం విశేషం. బలగం సినిమాను తెరకెక్కించిన వేణు యెల్దండి సిరిసిల్ల వాస్తవ్యుడు. ‘బలగం’ను ఊళ్లకు ఊళ్లు కూడళ్లలో గుమిగూడి ఒక్కింటి బిడ్డల్లా ఓపెన్ థియేటర్లలో తిలకించేంత గొప్పగా వేణు సినిమాను నిర్మించారు. ఒక విధంగా వీధుల్లో ముక్క సినిమా చూసిన రోజుల్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో అందరూ కాలం వెనక్కి వెళుతోందా అన్నట్టుగా తెలంగాణ సినీ వేణు చేసిన ఆ వి‘చిత్రం’ గురించి కథలు కథలుగా చెప్పుకొన్నారు.
తాజాగా అవార్డుల పంట పండింది. తెలంగాణ వెతలనే కథగా మలిచిన ఈ ప్రాంతవాసికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కటం జాతి బిడ్డలందరికీ గర్వకారణమే కదా! ఇక, ఏ యేటి మరో దర్శక రత్నం శ్రీకాంత్ ఓదెల. స్టార్ హీరోతో సినిమా తీసి ప్రేక్షకుల విశేషాదరణ పొందారు ఈ యంగ్ డైరెక్టర్. ఈయన స్వస్థలం తెలంగాణలోని గోదావరిఖని ప్రాంతం. హీరో నానిని, హీరోయిన్ కీర్తి సురేశ్‌ల నుంచి తనకు కావాల్సినంత ప్రతిభను రాబట్టడం ద్వారా వారు ఉత్తమ నటులుగా అవార్డులు పొందటంలో శ్రీకాంత్ కృషి అమోఘం.
కన్నుల పండువగా అవార్డుల వేడుక
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో శనివారం రాత్రి ‘69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక అట్టహాసంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి వేదికయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేదికపై పలువురు నటీమణుల ప్రదర్శనలు సభికులను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, రాశీఖన్నా, అపర్ణ బాలమురళీ, సానియా ఇయాపాన్, గాయత్రీ భరద్వాజ్ తదితరుల ప్రదర్శన ఆహూతులను ఆద్యంతం అలరించాయి.
నామినేషన్స్ జాబితాలో ఉన్నవారిలో విజేతలను ప్రకటిస్తున్న సమయంలో వేడుకకు వేదికైన ప్రాంగణమంతా చప్పట్లు, ఈలలతో మార్మోగింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బలగం’ ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన వేణు యెల్దండికి ఉత్తమ దర్శకుడి అవార్డు సైతం అందుకున్నారు.
‘దసరా’ చిత్రంలో నటనకు గాను నాని, కీర్తి సురేశ్‌లు ఉత్తమ నటీనటులుగా అవార్డు పొందారు. ఉత్తమ పరిచయ దర్శకుడి అవార్డును శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యవ్ (హాయ్ నాన్న) అందుకున్నారు. వీరిద్దరి సినిమాల్లోనూ నాని కథానాయకుడు నాని కావటం విశేషం. మరో బ్లాక్‌బస్టర్ మూవీ ‘బేబీ’కి కూడా పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి.
69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌ఱ తెలుగు విజేతల వివరాలు
- ఉత్తమ చిత్రం: బలగం
- ఉత్తమ నటుడు: నాని (దసరా)
- ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా)
- ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
- ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)
- ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మి (బలగం)
- ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (బేబీ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట)
- ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ చిత్రంలోని ‘మాస్టారు.. మాస్టారు..’ పాట)
- ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్ శ్రీరామ్ (బేబీ సినిమాలోని ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ పాట)
- ఉత్తమ సంగీతం: విజయ్ బుల్గానిన్ (బేబీ)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూరన్ (దసరా)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాశ్ (దసరా)
- ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (దసరా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తానా..’ సాంగ్)
ఈ అవార్డు మా అమ్మకు అంకితం
2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్ ప్రదానం చేసిన సినీ పురస్కారాల్లో ‘బలగం’ మూవీకి ఉత్తమ చిత్రం అవార్డు దక్కటంపై ఆ సినిమా దర్శకుడు వేణు యెల్దండి అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన ఆ నంద క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆగస్టు మూడో తారీఖు శనివారం రాత్రి గుర్తుంచుకోవాల్సిన సందర్భం. బలగం సినిమాకు మూడు అవార్డులు పొందటం నాలో ఆనందంతో పొంగిపోతోంది. ఈ కళాఖండాన్ని రూపొందించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఆదరిస్తున్నవాళ్లందరికీ కృతజ్ఞతలు. ఈ క్షణాల్లో మా అమ్మ నా పక్కనుంటే చాలా గర్వపడేది. మిస్ యూ అమ్మా! ఈ అవార్డును అమ్మకు అంకితం చేస్తున్నాను’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు వేణు.
చిత్రబృందాలకు సీఎం శుభాకాంక్షలు
బలగం చిత్రం దర్శకుడు వేణు యెల్దండి 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. మరో తెలంగాణ నేపథ్య చిత్రం దసరా సినిమా బృందాన్ని కూడా సీఎం ప్రశంసించారు. ఉత్తమ నటుడు నాని, ఉత్తమ నటీ కీర్తి సురేశ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సహా పలు కేటగిరిల్లో తెలుగువారు అవార్డులు పొందడం సంతోషకరమంటూ సీఎం ఉభయ చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు.
బలగం చిత్రబృందానికి కేటీఆర్ అభినందనలు
కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొంది అపురూప విజయం అందుకున్న ‘బలగం’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దక్కించుకోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుల ప్రదానం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రబృందానికి, దర్శకుడు వేణుకు అభినందనలు తెలిపారు. చిత్రబృందాన్ని ఉద్దేశించి ‘ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ఇది తొలిమెట్టు’ అని రాసుకొచ్చారు.