calender_icon.png 28 December, 2024 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం

10-09-2024 12:00:00 AM

రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించడానికి మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలు కేంద్రంగా రాజకీయ వ్యూహాలను రూపొందించుకుంటున్నట్లుగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం కనబడుతున్నది. మూడోసారి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటిస్తే, బీ జేపీ ఏకంగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామనే హామీతో శాసనసభ ఎన్నికలలో పో టీ చేసింది. మరొక వైపు అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ‘బీసీ బంధు’ ప్రకటించి బీసీల ఓట్లకు గాలం వేసే ప్రయత్నమూ చేసింది.

కానీ, శాసనసభ ఎన్నికల అనంతరం కూ డా రాష్ట్రంలో ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తమ రాజకీయ పునాదులను బలపరచుకోవటం కోసం బీసీలు కేంద్రంగా రాజకీ యాలకు తెర తీశాయనే చెప్పాలి. మరొక వైపు ఎన్నడూ లేని విధంగా బీసీ సంఘా లు, బీసీ కుల సంఘాలు బీసీలలోని మే ధావి వర్గం రాజకీయంగా తమ బలం ఏమిటో చూపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి.

దీనిలో భాగంగా రాష్ట్రంలో కులగ ణన చేపట్టాలనే డిమాండ్‌తో బీసీ ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నట్లుగా స్ప ష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కేంద్రంగా రాజకీయాలు మారిన నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయాలలో బీసీలు పోషించే పాత్ర ఏమిటి? బీసీ ఉద్యమాలతో రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకోబోతున్నాయి? అనేది రాష్ట్రంలో విస్తృత చర్చనీయాంశంగా మారింది.

అధ్యక్ష పదవితో గాలం 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే బీసీని ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్ష నియామకం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం పెద్ద కసరత్తే చేసింది. అనేక ప్రతిపాదనల నడుమ చివరికి బీసీ సామాజిక వర్గం నుండి మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ బీసీని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి: 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అగ్రవర్ణాలు అధికారంలో ఉంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలనే నియమించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ పర్యాయం కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు. రెండవది: శాసనసభ ఎన్నికలలో బీసీలకు టికెట్ల కేటాయింపులో సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీసీలలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం. మూడోది: పీసీసీ అధ్యక్ష పదవి మరో సామాజిక వర్గానికి కేటాయిస్తే బీజేపీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చిన పక్షంలో ఆ వర్గం వారు  బీజేపీ వైపునకు మళ్లుతారనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలో ఉండటం.

ఈ మూడు కారణాలతో తప్పనిసరి పరిస్థితులలో బీసీకి పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించారనే భావన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర అధ్యక్ష పదవి కేటాయింపుతో బీసీలలో తన పట్టు సడలకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడిందనే చెప్పాలి. సామాజిక సమతుల్యతలో భాగంగా అగ్రవర్ణాలకు ముఖ్యమంత్రి పదవి, బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి, ఎస్సీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ అధిష్ఠానం కేటాయించిందనే భావన వ్యక్తం అవుతున్నది.

బీసీ ముఖ్యమంత్రి కార్డు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజీపీ బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామనే ప్రధానమైన హామీతో ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. శాసనసభ ఎన్నికలలో బీజేపీ తన ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకోవడానికి బీసీ ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఒక కారణమనే చెప్పాలి. తెలంగాణలో బీజీపీ బలం పుంజుకోవటానికి వ్యూహాత్మకంగా సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్నదనే చెప్పాలి. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా రెండు ప్రధాన సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సహాయం చేయడం ద్వారా బలమైన మాదిగ సామాజిక వర్గంలో తన ఇమేజ్‌ని పెంచుకుంది.

మరొక వైపు బీసీలలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్ప జెప్పాలని అనుకోవడం ద్వారా బీసీ సామాజిక వర్గంలో బలం పెంచుకోవాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించిన నేపథ్యంలో అనివార్యంగా బీజేపీ కూడా తన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బీసీలకే కేటాయిస్తుందనటంలో సందేహం లేదు. కాబట్టి, బీసీ సామాజిక వర్గాలలో పట్టు కోసం బీజేపీకూడా బీసీలకు అధ్యక్ష పదవిని కేటాయించే అవకాశం లేకపోలేదు. 

బీఆరెస్ ఉద్యమబాట 

కాంగ్రెస్, బీజేపీలు బీసీలు కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటే, బీఆర్‌ఎస్ కూడా బలం పెంచుకోవడానికి బీసీ నినాదం అందుకున్నట్లుగా కనిపిస్తున్నది. కల్వకుంట్ల కవిత అరెస్టుకు ముందు అసెంబ్లీలో ఫూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్‌తో హడావుడి చేయటం, బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నాయకులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని క్షేత్రస్థాయిలో పార్టీ ప్రస్తావన లేకుండా ఉద్యమం చేయడం కూడా బీఆర్‌ఎస్ బీసీలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేయటంగానే చూడాలి. బీఆర్‌ఎస్ పార్టీకూడా భవిష్యత్తులో బీసీ ఉద్యమబాట పట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

డిక్లరేషన్ అమలు చేయకపోతే.. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ను అమలు చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతున్నది. ముఖ్యంగా కులగణన చేపట్టాలని, బీసీలకు ప్రతి బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని (ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ. 9,000 కోట్లు కేటాయించారు) స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై క్షేత్రస్థాయిలో బీసీలు ఉద్యమిస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటి వరకు ఈ విషయంపైన సానుకూల స్పందన, ప్రకటన చేయలేదనే చెప్పాలి. అధికార పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న లాంటి బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి బీసీ సమస్యలపై మాట్లాడుతూనే ఉన్నారు.

మరొక వైపు బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, మేధావులు, బీసీ ఉద్యమకారులు రాజకీయంగా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కటం లేదనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీలు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం. గతంలో కంటే బీసీలు తమ అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ అధికారం పట్ల అనేక వేదికలపై తమ గొంతు పెకిలిస్తున్నారనే చెప్పాలి. ‘మేమెంతో మాకంత వాటా’ అని వారు తీవ్రంగా నినదిస్తున్నారు. మరి, ఈ చైతన్యాన్ని రాజకీయ పార్టీలు ఎలా సర్దుబాటు చేస్తాయో వేచి చూడాల్సిందే. 

వ్యాసకర్త సెల్: 9885465877 

జమ్మూ, కశ్మీర్‌లో బీజేపీకి మద్దతు ఇస్తే స్థానికంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం. తమకు పాకిస్థాన్‌తో కలిసి ఉండడం ఇష్టం లేదని, భారత్‌కు వెళతామని పీవోకేలోప్రజలూ చెప్పేంత స్థాయిలో అభివృద్ధి చేస్తాం వారిని విదేశీయులుగా పాక్ చూస్తున్నా మేం మాత్రం సొంత మనుషుల్లాగా చూసుకుంటాం.

 రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి

రాహుల్ గాంధీ రెస్సెస్‌ను అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. దేశద్రోహి ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోలేరు. దేశాన్ని విమర్శించేందుకు  విదేశాలకు వెళ్లే వారు దానిసారాంశాన్ని అర్థం చేసుకోలేరు. భారత్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నట్లుంది.ఆరెస్సెస్ దేశ విలువలు, సంస్కృతితో పెనవేసుకుంది.

 గిరిరాజ్ సింగ్, కేంద్ర మంత్రి