మునుగోడు,(విజయక్రాంతి): నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో రోడ్ల, భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం టెండర్ ప్రాసెస్లో ఎన్ని రోడ్లు ఉన్నాయి, పనులు జరుగుతున్న రోడ్ల సంఖ్య ఎంత,భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోడ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలనీ,రోడ్డు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గత పది సంవత్సరాలుగా నిర్వహణకు నోచుకోని రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
గ్రామాలలో నిర్మించే రోడ్లకు డ్రైనేజీ, ఫుట్ పాత్, స్పీడ్ బ్రేకర్స్, సూచిక బోర్డులు ఉండేలా చూడాలన్నారు. ప్రతి రోడ్డు నిర్మాణంలో ప్రమాదపు మలుపులను తీసేసి వీలైనంత భద్రతతో కూడిన నాణ్యమైన రోడ్లను నిర్మాణం చేయాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రత చాలా ముఖ్యమని సూచిస్తూ అధికారులతో మాట్లాడి రోడ్డు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా రోడ్డు నిర్మాణాలు జరగాలని మునుగోడు నియోజకవర్గంలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్లగొండ ఆర్ అండ్ బి ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ సుధాకర్ రెడ్డి, మునుగోడు ఏఈ శిరీష్, నాంపల్లి ఏఈ వికాస్ లు పాల్గొన్నారు.