25-04-2025 01:32:51 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ‘భారత్ సమ్మిట్ ’తో తెలంగా ణను ప్రపంచానికి ఒక మాడల్‌గా చూపడానికి అవకాశం ఉందని, అందు కే రాష్ట్ర ప్రభుత్వం ఈకార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ మూలసిద్ధాంతాలు అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై 100దేశాలకుపైగా ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయపార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడు తుందన్నారు. గురువారం హెచ్‌ఐసీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐ సీసీ కార్యదర్శి గురుదీప్‌సింగ్ సప్పల్‌తో కలిసి భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడారు.. ఆనాడు ప్రపంచవ్యాప్తం గా బలమైన శక్తులైన అమెరికా, రష్యా కోల్డ్‌వార్ చేస్తుండగా, భారతదేశం అలీన విధానాన్ని ముందుకు తీసుకెళ్లిందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ర్ట ప్రభు త్వం ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండురోజుల పాటు చర్చించేందుకు ఆహ్వానించిందని చెప్పారు. ఈ సమావేశాల్లో రాష్ర్ట అభివృద్ధి, వనరులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అంశాలతో పాటు ప్రభుత్వ విజన్‌ను సమ్మిట్‌లో వివరిస్తామన్నారు.
ఇందిరా మహిళాశక్తి బజార్లు, గ్రామీణ ఉపాధి కల్పన తదితర అంశాలతో పాటు ఎకనమిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీసీ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలో భౌగోళిక, రాజకీ య, ఆర్థిక, ప్రజాస్వామికంగా పెనుమార్పులు సంభవిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తోందని తెలిపారు.
పెట్టుబడులకు అవకాశం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
భారత్ సమ్మిట్ నిర్వహణ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు రావడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో ప్రగతీశీల విధానాలపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ‘తెలంగాణ రైజింగ్’పై కూడా వివరిస్తామని చెప్పారు.
నేడు, రేపు హెచ్‌ఐసీసీలో భారత్ సమ్మిట్
రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో(శుక్ర, శనివారాలు) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లోని నోవాటెల్ హోటల్లో భారత్ సమ్మిట్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 140 సంవత్సరాలు కావడం, అలీన ఉద్యమానికి బీజాలు వేసిన బాండుంగ్ సదస్సు 70వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం ఈ రెండురోజుల సదస్సు నిర్వహిస్తోంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. 25వ తేదీన ‘హైదరాబాద్ డిక్లరేషన్’ ఆవిష్కరించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ప్రసంగించనున్నారు.
అర్జెంటీనా విదేశాంగ మాజీమంత్రి జోర్జ్ టయానా, కొలంబియా కార్మికశాఖ మాజీ మంత్రి సెనేటర్ క్లారా లోపెజ్ ఓబ్రెగాన్, స్వీడన్ విదేశాంగ మాజీమంత్రి అన్ లిండె, క్యూబా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల హెడ్ ఎమిలియో లొజాడా, మలేషియా న్యాయశాఖ మంత్రి ఎం.కులసేగరన్లతో పాటు దేశంలోని ప్రముఖ రాజ కీయ పార్టీల నాయకులు దిగ్విజయ్‌సింగ్, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాటె, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు హాజరుకానున్నారు.
ఏర్పాట్ల పరిశీలన..
హెచ్‌ఐసీసీలో భారత్ సమ్మిట్ ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నటరాజన్‌మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఇతర పార్టీ నాయకులు పరిశీలించారు. ప్రతినిధుల సమావేశం హాల్, కాన్ఫరెన్స్ హాల్, జస్టిస్ హాల్, లిబర్టీ హాల్, ఎక్స్‌పో పాత్ ఆఫ్ జస్టిస్ హాల్, ఫొటో ఎగ్జిబిషన్, రిసెప్షన్ ఎదురుగా చరఖాపై నూలు వడుకుతున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు.
టెర్రరిజంపై డిక్లరేషన్ : గురుదీప్‌సింగ్‌సప్పల్
భారత్ సమ్మిట్‌లో 8డిక్లరేషన్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు అదనంగా టెర్రరిజంపై డిక్లరేషన్ చేయనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి గురుదీప్‌సింగ్ సప్పల్ తెలిపారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా 15 రాజకీయ పార్టీల అధ్యక్షులతో పాటు పెట్టుబడిదారులు, 25 మంది మంత్రులు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో టెర్రరిజాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడంతో పాటు కశ్మీర్‌లో అదుపులోకి తీసుకొచ్చామన్నారు.