హైదరాబాద్: ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కి సమయం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 17 ఎంపీ స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,58,71,493 మంది పురుష ఓటర్లు, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు, 2,557 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి 45 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్ సభ స్థానానాకి 12 మంది బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మందిలోపే ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.