26-03-2025 02:46:01 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాలు బుధవారం(Telangana Legislative Assembly sessions) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ సవరణ బిల్లును తెలంగాణ శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించుకున్నామని, కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Panchayat Raj Minister Seethakka) పేర్కొన్నారు. అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని సభ్యులను కోరారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ బిల్లుపై చాలామంది సభ్యులు విలువైన సూచనలు చేశారని, బిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారని తెలిపారు. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలను గుర్తించామన్నారు. ఈ చట్టాన్ని 1/70 గా పిలుస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ప్రతేక హక్కులు కల్పించేందుకు, అభివృద్ధి జరిగేందుకు 1/70 కృషి చేస్తుందని వెల్లడించారు.
ఆ చట్టం అమల్లో ఏమన్నా సమస్యలు వుంటే పరష్కరిస్తామని, తామకు మున్సిపాలిటీ కావాలని ఎన్నో గ్రామ ప్రజలు అడుగుతున్నారని, మున్సిపాలిటీలు అయితే డెవలప్ అయితామని ప్రజలు భావిస్తున్నట్లు ఆమె సభలో చెప్పారు. ములుగు జిల్లా కేంద్రం అయినా.. మునిసిపాలిటీ చేయలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా చేసేందు సిద్ధంగా ఉందన్నారు. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలు ఆధారంగా మున్సిపాలిటీలుగా అప్డేట్ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చానా మండలాల్లోని గ్రామాలను ఇతర జిల్లాల్లో కలిపారని, స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నో గంధరగోళాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. కొన్ని గ్రామాలు ఒక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే రెవిన్యూ పరిధి మాత్రం వేరే మండలంలో ఉంటుందని ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని మంత్రి సీతక్క తెలిపారు. ఇద్దరు పిల్లల నిబంధన ఎట్టేయాలని అడుగుతున్నారు. ఈ విషయంపై క్యాబినెట్, సీఎం తో చర్చిస్తుందన్నారు. కొత్త గ్రామపంచాయతీలలో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలించి, గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు సభ్యులు ప్రస్తావించారు. వాటిని పరిష్కరిస్తున్నామని మంత్రి వెల్లడించారు.