calender_icon.png 16 March, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ వంటిది ఏమైనా ఉందా..?

15-03-2025 07:54:01 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. గత ప్రభుత్వం 2022లో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించిందని, గత ప్రభుత్వ నేతలు గవర్నర్ పదవిని కూడా గౌరవించలేదని మండిపడ్డారు. అన్ని వర్గాల వారితో చర్చించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందని సీఎం చెప్పారు. 

ఈ ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలనే, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచామని, ప్రజల ఆదరణ కోల్పోయిన ప్రతిపక్ష పార్టీ ఆలోచనలకు గవర్నర్ ప్రసంగంలో తావుండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆదరించి మాకు బాధ్యతలు అప్పగిస్తేనే మేం ఇక్కడున్నామని, స్టేచర్ గురించి నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నామని, 2023 డిసెంబర్ ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి స్టేచర్ ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సున్నా సీట్లు సాధించిందని, ప్రధాన ప్రతిపక్షనేత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 నెలల్లో సభకు కేవలం రెండుసార్లు వచ్చారని, ఈ 15 నెలల్లో కేసీఆర్ రూ.57.87 లక్షల జీతం తీసుకున్నారని, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత లక్షల్లో జీతభత్యాలు పొందారని సీఎం ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును జీతభత్యాలుగా పొందుతూ సభకు మాత్రమే రావట్లేదని, నియోజకవర్గానికి వెళ్లట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోం, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ వంటిది ఏమైనా ఉందా..? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏకకాలంలో 25 లక్షల 30 వేల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. వరి వేస్తే.. ఉరే అని.. వరి వేస్తే కొనేది లేదని రైతులను మాజీ సీఎం భయపెట్టారు. మేం మాత్రం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తూ వడ్లు కొనుగోలు చేశామని, రాష్ట్రంలో 1.57 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు.