13-03-2025 12:21:03 PM
సభా సంప్రదాయాలు తేలాలి.. స్పీకర్ అధికారాలు తేలాలి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS MLA Jagadish Reddy) చేసిన వ్యాఖ్యలపై గందరగోళంతో సభ వాయిదా పడింది. స్పీకర్ ను ఉద్దేశించి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. ఈ సభ అందరిది.. అందరికీ సమాన హక్కులు ఉన్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. మా అందిరి తరుఫున పెద్దమనిషిగా స్పీకర్ గా మీరు కూర్చున్నారు.. ఈ సభ మీ సొంతం కాదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పండని జగదీష్ రెడ్డి స్పీకర్ ను కోరారు. విమ్మల్ని ప్రశ్నించడం సభా సంప్రదాయాలకు విరుద్ధం కాదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
అటు జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేని శ్రీధర్ బాబు పట్టుబట్టారు. జగదీష్ రెడ్డి అహంకారంతో మాట్లాడొద్దు.. క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన కోరారు. జగదీష్ రెడ్డితో పాటు ఆయన పార్టీ క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోకి సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పు లేదు అన్నారు. సభ అంటే కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించింది కాదని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్ రెడ్డి అన్నారని ఆయన వెల్లడించారు. సభను ఆర్డర్ లో పెడితేనే నేను మాట్లాడతాను.. స్పీకర్ అధికారం గురించి మాట్లాడాలనుకున్నానని జగదీష్ రెడ్డి తెలిపారు. సభా సంప్రదాయాలు తేలాలి.. స్పీకర్ అధికారాలు తేలాలి.. సభ్యుల హక్కులు తేలాలి.. అన్నీ తేలాకే నేను మాట్లాడతానని అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.