calender_icon.png 24 October, 2024 | 2:00 PM

తెలంగాణకు గుండు సున్నా!

05-08-2024 12:57:07 AM

  1. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పైసా ఇవ్వని కేంద్రం 
  2. 2024-2025 తొలి త్రైమాసికంలో మొండిచెయ్యి 
  3. ఏపీ సహా పలు రాష్ట్రాలకు వేలకోట్లు సాయం
  4. కాగ్ మొదటి త్రైమాసిక ఆర్థిక నివేదికలో వెల్లడి 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల విడుదలలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నది. 2024-25 తొలి త్రైమాసికంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ నిధులు ఒక్క రూపాయి కూడా రాలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా చెప్పటం గమనార్హం.

క్యూ1లో అన్ని రాష్ట్రాలకు అంతోఇంతో సాయం చేసిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపినట్లు కాగ్ నివేదిక ద్వారా స్పష్టమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏప్రిల్, జూన్, జూలైలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్స్ విడుదల కాకపోవడం ఇదే తొలిసారి. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడగా, 2014-15 ఆర్థిక సంవత్సరం లో తొలి త్రైమాసికం ఆడిట్ జరగలేదు.

2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు క్యూ1లో ఎంతో కొంత సాయం చేసిన కేంద్రం.. ఈ ఏడాది మాత్రం రాష్ట్రంపై నిర్దయను ప్రదర్శించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చే నిధులనే ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 282 ఈ గ్రాంట్ల గురించి వివరిస్తుంది. ప్రజా ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఈ గ్రాంట ను విడుదల చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం గ్రాంట్ల విడుదల తప్పనిసరి కాదు. కానీ రాష్ట్రాల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తన విచక్షణతో నిధులను అందిస్తుంది.  

8 మంది ఎంపీలున్నా నిధులు సున్నా! 

ఆదివారం నాటికి కాగ్ 21 రాష్ట్రాల తొలి త్రైమాసిక ఆర్థిక నివేదికను కేంద్రానికి పంపింది. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు, విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్‌లో బీజేపీ నుంచి ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా ఆయా రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం నిధు లు ఇచ్చింది.  తెలంగాణ నుంచి ఏకంగా 8 మంది ఎంపీలను గెలిపించినా నిధులు ఇచ్చేందుకు చెయ్యి ఎందుకు రావడం లేదని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. 

కొన్నేళ్లుగా ఇదే తీరు..

గత కొన్నేళ్లుగా కేంద్రం ఇచ్చే గ్రాంట్లకు తెలంగాణ నోచుకోవడం లేదు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన లెక్కలకు, కేంద్రం విడుదల చేసినవాటికి భారీ వ్యత్యా సాలు ఉంటున్నాయి. 2022లో బడ్జెట్ అంచనాల్లో 22 శాతం మాత్రమే కేటాయించిన కేంద్రం.. 2023 అంచనాల్లో 32 శాతం నిధులను రాష్ట్రానికి విడుదల చేసింది. 2024లోనూ కేంద్రం నుంచి ఆశించిన నిధుల్లో భారీగా కోతపడింది. 23 శాతం నిధులను మాత్రం విడుఓదల చేసింది.