- పంట దిగుబడిపై వాతావరణ మార్పు ప్రభావం
- ఏడాదిలో 6.7కోట్ల టన్నుల ఆహారం వృథా
- కావేరి వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రవీణ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి) : తెలంగాణలో వైవిధ్యభరితమైన మార్పు ఫలితంగా వరి దిగుబడి పెరిగిందని కావేరి విశ్వవిద్యా లయం వైస్ ఛాన్స్‌లర్ డా.ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వ్యవసాయ పరివర్తనకు నేల, నీటి నిర్వహణ పరిష్కారాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ర్టంగా తెలంగాణ అవతరించిందన్నారు. అధిక నీరు, ఎరువుల వినియోగ సామర్థ్యం కోసం సెన్సార్లు. కవర్ క్రాప్స్ వినియోగించాలని సూచించారు. మన ఆహారపు అలవాట్లు కూడా జాతీయ లక్ష్యానికి అనుగుణంగా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాంసం కోసం ప్రతిరోజూ 300 ట్రక్కుల్లో గొర్రెలను హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారని, ఆదివారం వాటి సంఖ్య 500కు చేరుతుందన్నారు. తక్కువ వనరులతో ఎక్కువ ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయాలని సూచించారు. వాతావరణ మార్పు పంట దిగుబడిపై ప్రభావం చూపుతోందని, చాలా ఆహారం వృథా అవుతోందన్నారు.
దేశంలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 50 కిలోల ఆహారం వృథా చేస్తున్నాడని.. దాదాపు 6.7 కోట్ల టన్నుల ఆహారం పారబోస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడోస్థానంలో ఉందన్నారు.