calender_icon.png 11 October, 2024 | 12:43 PM

లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీల్లో తెలంగాణే గమ్యస్థానం

11-09-2024 03:17:55 AM

  1. జొయిటిస్ కంపెనీ ఏర్పాటే దానికి నిదర్శనం
  2. ఇక్కడున్న పారిశ్రామిక వనరులు ఎక్కడా లేవు
  3. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ప్రారంభోత్సవం 

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణే ప్రపంచానికి ఒక గమ్యస్థానం గా నిలుస్తుందని, దానికి హైదరాబాద్‌లో జొయిటిస్ ఏర్పాటే నిదర్శనమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. జంతు ఆరో గ్య సంరక్షణలో ప్రపంచ దిగ్గజమైన జొయిటిస్ కంపెనీ ఏర్పాటుతో లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలక మైలురాయిని దాటిందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పశువులు, పెంపుడు జంతువుల ఔషధాలు, పోషకాల ఉత్పత్తిలో జొయిటిస్‌కు ప్రపంచ గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌లో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన జొయిటిస్ సంస్థ బిజినెస్ ఆపరేషన్స్, డాటా మేనేజ్‌మెంట్, పరిశోధన, అభివృద్ధి లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి, తాను జొయిటిస్ యాజమాన్యంతో చర్చలు జరిపామని గుర్తుచేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అతి తక్కువ సమయంలోనే వారి సామర్థ్య కేంద్రాన్ని ప్రారం భించడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఒప్పందం చేసుకున్నట్టుగానే కంపెనీ ప్రారంభించడంలో వారి చిత్తశుద్ధిని జొయిటిస్ కంపెనీ, వారి ప్రతినిధులు నిరూపించుకున్నారని కొనియాడారు. 

సకల సౌకర్యాలకు నెలవు తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వంతో జొయిటిస్ భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా భావిస్తున్నామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు అద్భుతమైన ఉపాధి లభిస్తుందన్నారు. 2025 నాటికి వందలాది మంది సాఫ్ట్‌వేర్, పశువైద్య నిపుణులకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉపాధి అవకాశం లభించడంతోపాటు గ్లోబల్ హెల్త్‌కేర్ విప్లవంలో తెలంగాణ ముందు వరుసలో నిలబెట్టేందుకు దోహదం చేస్తుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా జంతు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణల్లో తెలంగాణ వనరులను ఉపయోగించుకోవడంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు. రింగురోడ్డు, మెట్రో, విద్యుత్, డ్రైనేజీలతోపాటు గొప్ప మానవ వనరులు ఇక్కడ లభిస్తున్నాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఇనిస్టిట్యూషన్లు, యూనివర్సిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల గ్లోబల్ ఏఐ సమ్మిట్ అద్భుతంగా నిర్వహించి విజయవంతం చేశామని గుర్తుచేశారు. 

నైపుణ్యం గల మానవ వనరులు 

ఇండియాలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో పెట్ అడాప్షన్ గణనీయంగా పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులు కలిగి ఉన్న వారి శాతం 6 శాతం ఉంటే భారతదేశంలో అది 10 శాతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి గొప్ప అవకాశం లభిస్తుందని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా ఉపాధి అవకాశం పొందేందుకు కూడా మార్గం సుగమమం అవుతుందని సూచించారు. ఈ జీసీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, పశువులు, జీవాల పెంపకందారులకు ఔషధాల సరఫరా, ఆరోగ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు అందించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం యువతలో నైపుణ్యం పెంపొందించడంతోపాటు తెలంగాణలో ప్రారంభిస్తున్న కంపెనీలకు కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించిందని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ పూర్తయిన వెంటనే విద్యార్థులను జొయిటిస్ వంటి కంపెనీలన్ని వారికి ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని కోరారు. ఈ విధమైన సౌకర్యాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేవని, కంపెనీలకు కావాల్సిన నైపుణ్యం ఉన్న మానవ వనరులను వంద శాతం అందిస్తామని వెల్లడించారు. ఆ స్థాయిలో సామర్థ్యం ఉన్న నగరం హైదరాబాద్ అని స్పష్టంచేశారు.

హైదరాబాద్‌లో జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ కార్యాకలాపాల ద్వారా తమ కంపెనీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో జొయిటిస్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తంచేశారు. డైనమిక్ నగరమైన హైదరాబాద్ నుంచి జొయిటిస్ కంపెనీ విస్తరణకు అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి, కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జొయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్, జొయిటిస్ ఇండియా కేపబులిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.