28-04-2025 01:45:53 AM
మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌కు తెలంగాణనే ఏకైక ఎజెండా అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిం చారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలం గాణ భవన్ వద్ద తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులుర్పించారు.
పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే జలదృశ్యం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి సైతం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి, వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
25 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో టీఆర్‌ఎస్ పురుడు పోసుకుందని గుర్తు చేశారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, నేడు లక్షల మందితో బలోపేతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి, కొండంత అండగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రా న్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పాటుపడుతోందన్నారు.25 సంవత్సరాలు నిండి, అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాల తో, మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.