02-02-2025 10:45:56 PM
ఎమ్మెల్యే పాయం..
మణుగూరు (విజయక్రాంతి): పార్లమెంట్ లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపు మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బడ్జెట్ పై ఎంతో ఆశతో ఎదురు చూశారని, వారి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లిందని అన్నారు. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించారని, బడ్జెట్ కేటయింపులో అన్ని రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించాల్సిన కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందనీ విమర్శించారు.
బిజెపి పాలిత రాష్ట్రాలకు బడ్జెట్ లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించి.. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ ప్రస్తావించలేదన్నారు. దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ రైతులకు కనీస మద్దతు ధరపై బడ్జెట్ లో ఆలోచన చేయలేదని, ఈ బడ్జెట్ మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూల బడ్జెట్ అని అన్నారు. తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపించారనీ, తెలంగాణ నుండి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ కు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు పైసా కేటాయించకుండా పూర్తి వివక్ష చూపిందని, మొత్తంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా మిగిల్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్టా తన విద్వేషాన్ని వీడి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని, సౌకర్యాలను పట్టించుకోవాలని కోరారు.