calender_icon.png 24 December, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీలో తెలంగాణ ఆదర్శం

19-10-2024 02:41:02 AM

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అధికమొత్తంలో రైతులకు రుణమాఫీ చేసి.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కర్ణాటక వ్యవసాయ శాఖమంత్రి చెలువరాయస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యవసాయరంగ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ అంతర్జాతీయ ఇష్టా విత్తన పరీక్ష కేంద్రాన్ని, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థను తన ప్రతినిధి బృందంతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కర్ణాటక మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇలాంటి విత్తన పరీక్ష ల్యాబ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అభినందించారు. ఈ పరీక్షా కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడమే కాకుండా, ఇతర దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందన్నారు.

కర్ణాటకలో పెద్ద మొత్తంలో కూరగాయల విత్తనోత్పత్తి జరుగుతుందని, ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్న దృష్ట్యా తమ రాష్ట్రంలోనూ ఇలాంటి అధునాతన విత్తన పరీక్ష ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం తీసుకుంటామని చెప్పారు. అనంతరం విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం  చేపడుతున్న పథకాలు, విత్తనరంగ అభివృద్ధికి చేస్తున్న కృషి, తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అవకాశాలు , అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రంలో ఉన్న పరికరాల గురించి  వివరించారు.