calender_icon.png 23 October, 2024 | 3:05 AM

తెలంగాణే ఊపిరిగా!

23-10-2024 12:00:00 AM

తాతల ‘ఆస్తి’ వారసత్వంగా మనవళ్లకి వస్తుందంటారు. కానీ ‘పోరాట వారసత్వం’ మాత్రం అలా రావాలని లేదు. తాత లక్షణాలను పుణికిపుచ్చుకుంటే తప్ప అది సాధ్యం కాదు. తాత చెప్పే వీరోచిత కథల్లో.. నానమ్మ పాడే బతుకు పాటలో తమ గతాన్ని.. నడిసొచ్చిన దారిని ఆకళింపు చేసుకున్న మనువడు తాత దారిలోనే పోరుబాట పట్టారు.

తాత వీర తెలంగాణలో సాయుధుడై నైజాంకు వ్యతిరేకంగా పోరాడితే.. మనువడు సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా సంఘం పెట్టి సమరానికి సై అన్నాడు. బతుకు మారాలంటే పోరు ఒక్కటే సరిపోదు, చదువు కూడా ముఖ్యమే అని అంబేద్కర్ మార్గంలో అక్షరాలు నేర్చి డాక్టరేట్ పట్టా పొందాడు.

ఉద్యమమే ఊపిరిగా.. బడుగుల బాగోగులే ధ్యేయంగా ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయనే తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని విజయక్రాంతితో నెమరువేసుకున్నారు.. 


మాది నల్లగొండ జిల్లా చండూరు మండలం దోనిపాముల గ్రామం. మాది సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం లో నేను చివరివాణ్ని.. తాత, నానమ్మ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అలా కుటుంబంలో ఉద్యమ వాతావరణం ఉండేది. చిన్నతనం నుంచి ఉద్యమాలే ఊపిరిగా బతికాను. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పని చేశాం. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని 610 జీవోను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది అప్పటి ప్రభుత్వం. దాంతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. నేను మున్సిపల్ అధికారిగా ఉన్నప్పటికీ.. ఆంధ్ర ప్రాంతపు అధికారులు తెలంగాణ ఉద్యోగులను డామినేట్ చేసేవాళ్లు. స్థానిక ఉద్యోగులను ఒకచిన్నచూపు చూడటం, వీళ్లకు తెలివిలేదు. జ్ఞానం లేదు. వీళ్లకు ఒక సమయ స్ఫూర్తి లేదని ఎద్దేవా చేసేది ఆంధ్ర అధికారులు. అలాగే ప్రాధాన్యత కలిగినటువంటి పదవుల్లో ఆంధ్ర ప్రాంతపు ఆఫీసర్లు ఉండటం వల్ల .. తెలంగాణ ఉద్యోగులకు నష్టం జరిగేది.

చిన్నచూపు తట్టుకోలేకపోయాం!

ఉదాహరణకు హైదరాబాద్‌లో 18 సర్కిల్స్ ఉంటే 18 అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ పోస్టులు ఉంటే దాంట్లో 14 మంది ఆంధ్ర పాంత్రం వాళ్లు ఉండేది. 18మంది డిప్యూటీ కమిషనర్లు ఉంటే.. 12మంది డిప్యూటీ కమిషనర్లు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లు. పదిమంది అడిషనల్ కమిషనర్లు ఉంటే ఎనిమిదిమంది అడిషనల్ కమిషనర్లు ఆంధ్ర ప్రాంతం వారే. ఇది చట్టప్రకారం పూర్తిగా వ్యతిరేకం.

హైదరాబాద్ మున్సిపల్ రంగంలో చట్టప్రకారం ఉద్యోగాల్లో స్థానికులు మాత్రమే ఉండాలి. కానీ ఆంధ్ర ప్రాంతం అధికారులు ప్రాధాన్యత కలిగిన పదవుల్లో ఉండి.. తెలంగాణ ఉద్యోగులను ఉండనివ్వకుండా.. బానిసలుగా చూసేది. అప్పుడే తెలంగాణ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏర్పడింది. ఇక్కడి ఉద్యోగులకు జరుగుతున్న నష్టాలపై దృష్టి కేంద్రీకరించాం.

స్థానిక యువతకే ఉద్యోగాలు రావాలని 22ఎఫ్‌ను రద్దు చేయాలని సిద్ధిపేటలో ‘ఉద్యోగ ఘర్షణ’ సభ నిర్వహించాం. ఆ సభ తర్వాత మా దృష్టి హైదరాబాద్ మీద పడ్డది. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు సచివాలయంలో, స్టేట్ హెడ్ ఆఫీసుల్లో పై స్థాయి అధికారులుగా ఉండేవారు.

వాళ్లే జీవోలు తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రాంతపు ఉద్యోగులకు పెద్ద నష్టం జరిగేది. ఇవన్నీ తట్టుకోలేక.. ఉద్యోగుల జేఏసీలు ఏర్పాటు చేశాం. తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాం. దీనికోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గమని ఉద్యమబాట పట్టాం.

ఐక్యకార్యాచరణతో..

జీహెఏంసీలో స్టేట్ మున్సిపల్ రంగంలో 18 ఉద్యోగ కార్మిక సంఘాలు ఉన్నాయి. రెవెన్యు, ఎంప్లాయిస్ అసోసియేషన్, ఇంజనీర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టౌన్ ప్లానింగ్ అసోసియేషన్, కార్మిక సంఘాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏకం చేసి 2007లో మేం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీని ఏర్పాటు చేశాం. 18 సర్కిల్స్‌లో జరుగుతున్న అన్యాయాలను వివరించి.. ప్రజలను చైతన్యపరిచి..

ప్రతి సర్కిల్ దగ్గర ఉద్యమాలు చేశాం. ఇదే క్రమంలో 2009లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతామని ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్‌లో అసలు ఉద్యమమే లేదనుకున్న సమయంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాలు ముందు వరుసలో నిలబడి ఉద్యమాన్ని ప్రారంభించాయి.

ముఖ్యమంత్రి ఇంటి ముందు..

ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డిగారి ఇంటి ముందు చెత్తవేసే సాహసం చేశాం. నిజంగా మేం అనుకున్నాం. మా పని అయిపోయింది. ఉద్యోగం చేయలేం.. సస్పెండ్ చేస్తారు అనుకున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త వేసిన ఘనత మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ నిర్వహించింది. తర్వాత సహయ నిరాకరణలో ముందు వరుసలో నిలబడి..

‘పెన్ డౌన్’ కార్యక్రమాన్ని వారోత్సవలుగా జరుపుకున్నాం. ఉద్యమమే ఊపిరిగా పని చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఉద్యోగాల్లో కింది స్థాయిలో పనిచేసేది ఎవరంటే.. తెలంగాణ వాడే..  ఒక జోనల్ స్థాయి ఆఫీసర్ ఉన్నాడు అంటే వాడు ఆంధ్ర ప్రాంతం వాడు. ఈ వ్యత్యాసాన్ని జీర్ణించుకోలేక మేం దేనికైనా సిద్ధమని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాం.   

తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా.. 

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక ప్రధాన భూమిక పోషించింది. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థులంతా కలిసి 2004లో ఏర్పాటు చేశాం. మొదట్లో దీన్ని తెలంగాణ ఇంటలెక్చవల్ ఫోరం అనుకునే వాళ్లం. కానీ ప్రొఫెసర్ జయశంకర్ సర్‌గారు ఏం చెప్పారంటే.. మనకు మనమే మేధావులుగా క్రియేట్ చేసుకోవడం సరైంది కాదని చెప్పారు.

ప్రజల సమస్యలు మనకంటే వాళ్లకే ఎక్కువగా తెలుసు. మనం ఒక విద్యావంతులుగా  వాళ్లకు ఒక మార్గం చూపించాల్సిన బాధ్యత మాత్రమే మనపై ఉందని చెప్పారు. దీనికి గౌవర అధ్యక్షులుగా ప్రొఫెసర్ జయశంకర్‌గారు, ఫౌండర్‌గా ప్రొఫెసర్ కొందడరామ్‌గారు ఉన్నారు. ఉద్యోగులుగా.. కొంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులుగా తెలంగాణ విద్యావంతుల వేదికలో ఉండి ఉద్యమాన్ని నడిపించాం.

ఆ తర్వాత తెలంగాణ జేఏసీకి ఒక ఇరుసుగా ఇది పని చేసింది. ప్రజలను చైతన్యవంత పరచడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక ముందు నిలబడి పని చేసింది. దాని పాత్ర చాలా గొప్పది. ప్రజలను చైతన్యపరచడం అంటే మామూలు విషయం కాదు. 2017 నుంచి తెలంగాణ విద్యావంతుల వేదికకు నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇది ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టువంటి సంఘం.    

చెత్తను ఎత్తోద్దు.. చెత్తను తీయొద్దు!

ఉద్యమ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం, సకల జనుల సమ్మేలో ముందు వరుసలో నిలబడి పని చేశాం. వంటవార్పు కార్యక్రమం ద్వారా రెగ్యులర్‌గా నిరసన తెలిపేవాళ్లం. ఆ తర్వాత రెండు రోజుల సమ్మే.. ‘చెత్తను ఎత్తోద్దు.. చెత్తను తీయొద్దు’ అని రెండు రోజులు పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్నీ మున్సిపాలిటీల్లో చెత్తను ఎత్తొద్దు.. రోడ్లు ఊడ్చోద్దు అని నిరసన కార్యక్రమాలు చేశాం.

రాస్తా రోకోలు, మిలియన్ మార్చ్‌లో జీహెచ్‌ఏంసీ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ తెలుగు తల్లీ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీలో మాపై పోలీసులు బాంబులతో దాడి చేశారు. ఆ సమయంలో నేనే ముందు వరుసలో ఉన్నా.. నిమిష మాత్రంలో ప్రమాదం తప్పింది.. లేదంటే చనిపోయేవాడిని.

అలాంటి దుర్ఘటనలో ఇది మరిచిపోలేని ఘటన. ఆ రోజు ఏసీపీగా ఉన్నటువంటి ఓ ఆంధ్ర పోలీసు ఆఫీసర్, పోలీసు బెటాలియన్ దించి మమ్మల్ని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసుస్టేషన్‌లో రెండురోజులు పెట్టారు. అ యినా మేం ధైర్యం కోల్పోకుండా ఉద్యమంలో పాల్గొన్నాం. 

కొంతవరకు విజయం సాధించాం..

అలాంటిదే మరో ఘటన..  ఖైరతాబాద్ మున్సిపల్ ఆఫీసు ముందు మేం ఒక సభ నిర్వహించాం.. ఆ సభ నిర్వహిస్తుంటే.. ఖైరతాబాద్ ఆఫీసు చుట్టూ  ఐదారు వ్యాన్ల నిండా పోలీసు బెటాలియన్ దింపేసి.. మమ్మల్ని అందర్ని ఎత్తుకొని పోయి ఛత్రినాక పోలీసు స్టేషన్‌లో పెట్టారు. అలా కార్మికులను, ఉద్యోగులను  భయందోళనకు గురిచేశారు.

మమ్మల్ని అరె స్టు చేసినా కూడా మొక్కవోని ధైర్యంతో మా తర్వాత క్యాడర్ వచ్చి ఆ సభ ను కొనసాగించింది. అదొక యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. దాన్ని మేం ఎప్పటికీ మర్చిపోలేం. నిజంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని మేం చూడలేదు.. కానీ దాన్ని మేం విన్నాం.. చదివాం.. ఆ గొప్ప పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపించాం.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప అనుభవం. తెలంగాణ వచ్చాక మనకు ఏం వచ్చిందని’ అంటుంటారు చాలామంది. అది నిజమే కావొ చ్చు. దాన్ని మనం కాదనలేని సత్యమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు ఇక్కడి అభివృద్ధి కోసం ఖర్చు చేశా రు.

ఇది అతి పెద్ద మార్పు. నీళ్ల విషయంలో చిన్నచిన్న ఆనకట్టాలు నిర్మించడం జరిగింది. కొంతవరకు మన నీటిని మనవైపు మళ్లీంచుకున్నాం.

రూప

అది ఆంధ్రోళ్ల కుట్ర..

హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ మీద జరిగినటువంటి సాగర హారంలో కూడా విజయవంతంగా పాల్గొన్నాం. అయితే ట్యాంక్ బండ్ మీద కూలగొట్టిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో.. ఆ విగ్రహాలను ఆంధ్ర పాంత్రం వాళ్లే కొంతమంది గుండాలను పెట్టి విగ్రహా లను ధ్వంసం చేశారు.

అయితే ఆ జరిగిన ఘటనలో మున్సిపల్ ఉద్యోగులు లేనప్పటికీ ప్రత్యేక్షంగా మేం ఆ హుస్సేన్‌సాగర్ కట్టమీద ఉండటం ద్వారా మా ఉద్యోగుల మీద పోలీసు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. బలరాం లాంటి మా నాయకుడు మమ్మల్ని తప్పించారు. కింది క్యాడర్ వాళ్లను పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారు.

అందర్ని ఛత్రినాక పోలీసు స్టేషన్‌లో బంధించారు. ఇట్ల హుస్సేన్‌సాగర్ మీద జరిగిన మిలియన్ మార్చ్, సాగర హారం, వంటవార్పు కార్యక్రమం, సహాయ నిరాకరణ ఉద్యమం, రాస్తారోకోలు చేయని రోజంటూ లేదు. ఆ ఉద్యమం తెలంగాణ సాధించేంతవరకు కొనసాగింది.