calender_icon.png 1 October, 2024 | 3:40 AM

సాంకేతిక ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామి

01-10-2024 01:18:10 AM

అభివృద్ధి పథంలో రాష్ట్ర టెక్నాలజీ రంగం

అంచామ్ ఇండియా హైదరాబాద్ సిగ్నేచర్ ఈవెంట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సాంకేతికత, ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అంచామ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ సిగ్నేచర్ ఈవెంట్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షించాయని వెల్లడించారు.

రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించి, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలకు తెలంగాణ ప్రాధాన్యత గల గమ్యస్థానంగా నిలించిందన్నారు. 2024లో తెలంగాణ ఐటీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ముఖ్యంగా కొత్త సాంకేతికతలపై బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, సైబర్ సెక్యూరిటీ పురోగతుల దృష్ట్యా ఈ అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు.

కృత్రిమ మేథస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైయిన్ సాఫ్ట్‌వేర్‌లు రాష్ట్రంలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. టీ వంటి ఆవిష్కరణ కేంద్రాలు కృత్రిమ మేథస్సుకు, ఐవోటీ వంటివి వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, తయారీ రంగాల్లో విస్తృతంగా దోహపడ్డాయని చెప్పారు. తెలంగాణలో స్టార్టప్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందిందన్నారు.

ఫిన్‌టెక్, ఆరోగ్యం, విద్య రంగాల్లో కొత్త స్టార్టప్‌లు ఆవిష్కరణలు చేయడంతోపాటు ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయని తెలిపారు. తెలంగాణ ఆధారిత స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను దక్కించుకున్నాయని పేర్కొన్నారు.

సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యత కూడా పెరిగిందన్నారు. కొత్త స్టార్టప్‌లకు తలెత్తుతున్న సైబర్ ప్రమాదాలను ఎదుర్కోవడం తోపాటు డేటా రక్షణను మెరుగుపర్చడానికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంపొందించడానికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.