calender_icon.png 11 October, 2024 | 6:51 AM

ఓఈఎంలకు గమ్యస్థానం తెలంగాణ

10-10-2024 12:24:59 AM

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

ఫ్రెంచ్ ఎయిరోస్పేస్ ప్రతినిధులతో సమావేశం 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్ (ఓఈఎం) తయారీ కంపెనీలకు గమ్యస్థానంగా తెలంగాణ ఎదిగిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. సఫ్రాన్, ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ జీఈ ఏవియేషన్ రేథియాన్ వంటి కంపెనీల ఏర్పాటే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

తెలంగాణకు వచ్చిన ఫ్రెంచ్ ఏ రోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌కు చెందిన 90 మంది ప్రతినిధుల బృందంతో మంత్రి బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఫ్రెంచ్ బృందం సందర్శనతో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంతో ఫ్రాన్స్, తెలంగాణల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో అవలంబిస్తున్న పారిశ్రామిక పాలసీ కారణంగా ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ సెక్టార్లకు సంబంధించిన పెట్టుబడుల విషయంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని చెప్పారు.

నైపుణ్యమున్న మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగానికి బలోపేతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని ఫ్రెంచ్ ప్రతినిధులను ఆహ్వానించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో సఫ్రాన్, డస్సాల్ట్, ఎంబీడీఏ, అరియన్ గ్రూప్, సీఎన్‌ఈఎస్, డాహెర్, హెక్సెల్, లైబెర్, రోక్సెల్, సోర్పా స్టెరియా అరేసియా వంటి ఏరోస్పేస్ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు.