calender_icon.png 21 January, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంస్కృతిక గడ్డ తెలంగాణ

21-01-2025 01:58:36 AM

* చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే

* ముంబైకి బదిలీ నేపథ్యంలో వీడ్కోలు

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడంతో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందని, ఈ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పేర్కొన్నారు. ముంబే హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్న ఆయనకు సోమవారం హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్‌లో న్యాయమూర్తులు వీడ్కోలు చెప్పారు.

చీఫ్ జస్టి స్ ఆరాధే మాట్లాడుతూ దేశంలో అత్యున్నత హైకోర్టుల్లో తెలంగాణ ఒకటన్నారు. తెలంగాణలోని వారసత్వాన్ని, సమగ్రతను హైకోర్టు కొనసాగిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన తెలంగాణ హైకోర్టులో అత్యధిక సంఖ్యలో మహిళా న్యాయమూ ర్తులు ఉండటం స్వాగతించదగ్గ విషయమని కొనియాడారు.

చీఫ్ జస్టిస్‌గా క్రిమినల్ కేసుల్లో వారెంట్లు, సమన్లను అందించడానికి ఎన్-స్టెప్ ను అమల్లోకి తెచ్చినట్లు చెప్పారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాబోయే చీఫ్ జస్టిస్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ కేసుల విధానాన్ని తర్వాత కూడా కొనసాగించారని, కేసుల కం ప్యూటరీకరణ చేయించడంలో ప్రత్యేక చొరవ చూపారని చెప్పారు.

కేసుల సత్వర పరిష్కారానికి, ప్రజలు, న్యాయవాదులు, సిబ్బంది కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారన్నారు. కొత్త హైకోర్టు భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారని, నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి రూ.2,580 కోట్లు మంజూరు చేయించారని కొనియాడారు. సీజేగా జస్టిస్ ఆరాధే 8,404 కేసులు పరిష్కరించగా, 6,177 అత్యంత ప్రధానమైనవిగా చెప్పారు.

తొలుత అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసుల నమోదు సంఖ్య కంటే ఎక్కువ కేసులను పరిష్కరించారని చెప్పారు. 1958 నాటి భూవివాద కేసులో తీర్పు వెలువరించి ప్రభుత్వ ఆస్తిని కాపాడారని, ఎన్నో కీలక తీర్పులు వెలువరించారని కొనియాడారు. వీడ్కోలు సమావేశంలో న్యాయమూర్తులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ బీ నరసింహశర్మ, అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.