22-04-2025 01:04:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం సెకండియర్‌లో 71.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాపంగా ఈ ఏడాది మార్చి 5 నుంచి మార్చి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73.83శాతం, బాలురు 57.83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ సెకండియర్ లో బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతాడేది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సారి కూడా బాలికలదే హవా. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in, manabadi.co.in లో హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు అధికారులు మాట్లాడుతూ... ఈ ఫలితాలు విద్యార్థుల ఉన్నత విద్య, కెరీర్ ఎంపికలలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యార్థులు తమ ఫలితాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ అధికారులను సంప్రదించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం వారం గడువు ఉంటుందని, మే 22వ తేదీన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
గత సంవత్సరం (2024) ఇంటర్ ఫలితాలలో మొదటి సంవత్సరం పాస్ శాతం 60.01% కాగా, రెండో సంవత్సరం పాస్ శాతం 64.19%గా నమోదైంది. మొత్తం 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బాలికల పాస్ శాతం 68.35%, బాలుర పాస్ శాతం 51.50%గా ఉంది. రంగారెడ్డి జిల్లా మొదటి సంవత్సరంలో, ములుగు జిల్లా రెండవ సంవత్సరంలో మంచి ఫలితాలు కనిపించాయి.