calender_icon.png 18 October, 2024 | 3:56 PM

అప్పుల ఊబిలో తెలంగాణ

18-10-2024 02:03:49 AM

  1. ఒక్క హామీని నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం 
  2. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు 
  3. మున్నేరు వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం 
  4. ఖమ్మంలో మీడియాతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ 

ఖమ్మం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పది నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు.

గురువారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఎంపీ ఈటల విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రూ.49 వేల కోట్లకు పైగా కేంద్రం నుంచి రుణం తీసుకుందని, ఈ 10 నెలల కాలంలో అందినకాడికి అప్పులు తీసుకువచ్చారని విమర్శించారు.

గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ప్రజల చేత ఛీకొట్టించుకున్నదని అన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకపోగా, అడిగితే బెదిరించడంతోపాటు బుకాయింపులకు పాల్పడుతుందని దుయ్యబట్టారు.

సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం, హైడ్రాతో ఎంతోమంది రోడ్డున పడ్డారని, మూసీ ప్రక్షాళన వెనుక ఉద్దేశాలు వేరే ఉన్నాయని ఆరోపించారు. మూసీలో మంచినీరు పారాలే కానీ విషంతో కూడిన రసాయనాలు, వ్యర్థాలు కాదని, అసలు ప్రభుత్వం ఏమి చేయబోతున్నదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.  

రుణమాఫీ చేయకపోతే తిరుగుబాటే 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకపోతే రైతాంగం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం తధ్యమని ఈటలఅన్నారు. అనేక కొర్రీలు పెట్టి, రుణమాఫీని నీరుగార్చి, రైతులను మోసం చేశారని విమర్శించారు. ఇంతవరకు రుణమాఫీ సంగతి తేలలేదని, ఇక రైతుబంధు, కౌలు రైతుల ఊసే లేదని అన్నారు.

ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తానని సీఎం ప్రగల్బాలు పలికారని, ఇంతవరకు ఏదీ చేయలేదని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని కండిషన్స్ లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.  రుణమాఫీ కాక రైతులు మానసిక ఆందోళనతో గుండెపగిలి చచ్చిపోతుంటే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంగతేందో రైతులే తేల్చుతారని అన్నారు.  

పరిహారం అందక అల్లాడుతున్న మున్నేరు బాధితులు 

వరదలు వచ్చి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఖమ్మం మున్నేరు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫ లమైందని ఈటల ఆరోపించారు. వరదల్లో ఇళ్లు, పంటలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డా  ప్రభుత్వం వారిని ఆదుకోకుండా ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. ఖమ్మం లో 10 వేలకు పగా ఇళ్లు ముంపునకు గురయ్యాయని, ప్రభుత్వం వారి ని కూడా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. మళ్లీ వరదలు రాకుండా శాశ్వత ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు గుమ్మం కూడా దాటడం లేదని విమర్శించారు.