పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తప్పుపట్టిన హైకోర్టు
నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా?
హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ఆర్డర్ క్యాష్ పిటిషన్ పై బుధవారం వాదనలు ముగిశాయి. నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. నరేందర్ రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా? అని పీపీని ధర్మాసనం ప్రశ్నించింది. దాడి కి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని తెలిపింది. తీవ్రగాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్లు రాశారని హైకోర్టు చెప్పింది. నరేందర్ రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని కోర్టు ఆరోపించింది. ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ తెలిపారు. ఈ దశలో పిటిషన్ ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని పీపీ వెల్లడించారు. రిమాండ్ ఆర్డర్ ను క్యాష్ చేయాలని, పిటిషన్ ను కొట్టివేయాలని పీపీ తెలిపింది.