30-04-2025 12:19:31 PM
హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) విచారణ ముగించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. భూములను నిషేధిత జాబితా(Prohibited list)లో ఉంచాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అదే బెంచ్ లో వెకేట్ పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. రవిగుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్యా మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
భూదాన్ భూ సమస్యపై(Bhoodan land issue) పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 24న ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు, 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని ఆదేశించింది. జస్టిస్ భాస్కర్ రెడ్డితో కూడిన సింగిల్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇటీవల, ఈ తీర్పును సవాలు చేస్తూ కొంతమంది ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా ఉన్నారు. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, మహేశ్వరం మండలానికి చెందిన బిర్లా మల్లేష్ సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి(Justice CV Bhaskar Reddy) ఏప్రిల్ 24న ఈ విషయాన్ని విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం.. రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని స్పష్టమవుతుందని స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సామాజిక ఆస్తుల రక్షణలో భాగంగా హైకోర్టు తన విచక్షణాధికారంతో ఈ పిటిషన్ విచారణ ముగిసే వరకు ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ భూముల్లో ఎలాంటి మార్పులు లేదా చేర్పులు చేయవద్దని, ఎలాంటి పరాయీకరణకు అనుమతి లేదని ప్రతివాదులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.