calender_icon.png 30 September, 2024 | 2:03 PM

చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా?: హైకోర్టు

30-09-2024 11:29:18 AM

హైదరాబాద్: అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. అమీన్ పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు?.. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు  తీర్పులున్నాయన్న హైకోర్టు  ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది..?.. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ కు మొట్టికాయలు వేసింది.

ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని అధికారులను ప్రశ్నించింది. పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయవద్దని హైకోర్టు హెచ్చరించింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరికోరి అడుతారు కదా.. పొలిటికల్ బాస్ లను సంతృత్తి పరిచేందుకు పనిచేయవద్దని తెలిపింది. అధికారులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని తెలియదా?.. ఎమ్మార్వో విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ తెలిపారు. ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా?.. ఎమ్మార్వో అడిగితే చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా? అని హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది.