calender_icon.png 30 September, 2024 | 2:01 PM

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురక

30-09-2024 11:58:56 AM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో అమీన్ పూర్ హైడ్రా కూల్చివేతలపై సోమవారం విచారణ జరుగుతోంది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. అటు అమీన్‌పూర్‌ తహశీల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ కోర్టు సీరియస్‌ అయింది. కోర్టు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలంటూ హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురకలంటించింది. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సివస్తుందని తహసీల్దార్ కు హెచ్చరించింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా?.. చనిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని హైకోర్టు తెలిపింది.

ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా..?, ఆదివారం కూల్చివేయొచ్చా అని హైడ్రా కమిషనర్ ను కోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని రంగనాథ్ కు సూచించింది. కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది కోరడంతో సమచూర్చామని రంగనాథ్ తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా..? హైడ్రా ఇదే విధంగా ముందకు వెళితే స్టే ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు ధాఖలయ్యాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచామని తెలిపింది. ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం లేదన్న హైకోర్టు ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉందని చెప్పింది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయవచ్చుకదా..?.. హైడ్రా ఏర్పాటు అభినందనీయం.. పనితీరే అభ్యంతరకరం అని హైకోర్టు పేర్కొంది. అమీన్ పూర్ ఎమ్మార్వో, హైడ్రాకమిషనర్ తీరు అసంతృప్తికరంగా ఉందని కోర్టు తెలిపింది.