మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అందరికీ తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని కోటకదిర గ్రామంలో ముదిరాజ్ సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కులమతాలకు అతీతంగా సముచితమైన స్థానం, ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ లను గత ప్రభుత్వం విస్మరించిందని, ఇన్ని సంవత్సరాలుగా వారికి ఒక భవనం లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్ అభివృద్ధికి కట్టుబడి వారికి అన్ని విధాలా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా కేవలం కులవృత్తులనే కాకుండా మీ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు.
ఈ భవనాన్ని గ్రామంలో అందరికి ఏ అవసరం వచ్చినా వినియోగంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్సకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి, ముకుంద రమేష్, మాధవ రెడ్డి, గోవింద్ యాదవ్, ఆశన్న ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, గూడెం రామచంద్రయ్య, అనిల్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.