calender_icon.png 2 November, 2024 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకాలు పూర్తయ్యేనా?

26-04-2024 12:05:00 AM

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. 

కొంత కాలం క్రితం టీఎస్‌పీఎస్సీ ద్వారానే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని సాక్షాత్తూ ముఖ్యమంత్రి 

రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. ఈ హామీ నెరవేర్చటం సాధ్యమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 

నాలుగు నెలలు గడిచింది. ఇప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లు ఒకటి, రెండు మాత్రమే. 

రాబోయే మరో ౮ నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నది. 

బెక్కం వేణు

ఉద్యోగ నియామకాలు ఏడాదిలోనే భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. తమ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కూడా సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ, ఆయన ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు, మూడు వేల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు.

యువతలో వ్యతిరేకత ఎందుకు?

సుదీర్ఘంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానంగా వినిపించిన నినాదాలు మూడు. నీళ్లు, నిధులు, నియామకాలు. వీటిలో మొదటి రెండు అంశాలు ఎలా ఉన్నా లక్షలాదిమంది యువతను ఉద్యమం వైపు నడిపించింది మాత్రం నియామకాల తాలూకు నినాదమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల  ఎన్నో ఆశలతో ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభు త్వం, టీఎస్‌పీఎస్సీ నిరుద్యోగుల ఆశలను పూర్తి గా నెరవేర్చలేక పోయాయి. తమ పదేండ్ల పాలనలో 2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని నాటి పాలకులు గొప్పగా ప్రకటించుకొన్నారు. అయితే, నిజంగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేశారా? అవే ఇచ్చి వుంటే, ఇటీవలి అసెం బ్లీ ఎన్నికల్లో నిరుగ్యోగ యువత బీఆర్‌ఎస్ పై అంతగా వ్యతి రేకత చూపించి వుండేది కాదేమో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పదేండ్లలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏర్ప డిన వివాదాలు మరే ఇతర రంగంలోనూ ఏర్పడి ఉండక పోవచ్చు. 2015లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటు ఎంతో ఘనంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఎన్నో రకాలుగా మోసపోయామని భావించిన తెలంగాణ నిరుద్యోగ యువత, టీఎస్‌పీఎస్సీపై కోటి ఆశలు పెట్టుకొన్నది. అందుకు తగ్గట్టుగానే అనేక సంస్కరణలు వచ్చాయి. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ వంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టి నిరుద్యోగుల్లో ఆశలు కల్పించారు. ఆచరణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మాత్రం టిఎస్‌పీఎస్పీ అనేక విమర్శలు ఎదుర్కొన్నది. టీఎస్‌పీఎస్పీ వేసిన మొదటి ‘గ్రూప్  నోటిఫికేషనే అనేక వివాదాలకు కారణం కావడం గమనార్హం. ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన దాదాపు ప్రతి నోటిఫికేషన్ వివాదాస్పదమే అయ్యింది. 

పదేండ్లలో భర్తీ అయినవి ఎన్ని?

తమ పదేండ్ల పాలనలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కిందటేడాది అక్టోబర్ 28న ప్రకటించారు. 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు, మరో 88 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశలలో ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా పదేండ్ల పాలనలో ఏటా సగటున 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేపట్టినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ నేతలంతా విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, నిరుద్యోగులు ఈ లెక్కలను నమ్మలేదు. రాష్ట్రంలోని అన్ని రిక్రూట్‌మెంట్ బోర్డులద్వారా 2.2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కేటీఆర్ తెలిపారు. అయితే, టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైన రోజునుంచి ఇప్పటివరకు కమిషన్ ద్వారా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారని ఇటీవల ఓ ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) కార్యకర్త అడిగిన ప్రశ్నకు, 2015 జూలైనుంచి ఇప్పటి వరకు 36,643 ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టు టీఎస్‌పీఎస్సీ బదులిచ్చింది. ఇందులో 29,015 ఉద్యోగాల భర్తీ పూర్తయ్యిందని, 5,916 ఉద్యోగాల భర్తీ కోర్టు కేసులు, పలు ఇతర సమస్యలవల్ల నిలిచి పోయినట్టు సంస్థ వెల్లడించింది. 2017లో అత్యధికంగా 26,443, 20౧8లో 4,226 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపింది. 2019లో 42 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్ర మే భర్తీ చేసినట్టు టీఎస్‌పీఎస్సీ పేర్కొన్నది. అంటే, కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం బీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన 1.32 లక్షల ఉద్యోగాల్లో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసినవి అతికొద్ది మాత్రమే. మిగతావన్నీ పోలీస్, టీచింగ్ తదితర పోస్టులన్న మాట. 

కాంగ్రెస్‌కు ఎంత సమయం?

ఇక, ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే, 2014 నుంచి 2024 వరకు పదేండ్లలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఉద్యోగాల ఖాళీలు 1.17 లక్షలు. అంటే, సగటున ఏటా ఏర్పడిన ఖాళీలు 11,700. బీఆర్‌ఎస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏండ్లనుంచి 61 ఏండ్లకు పెంచింది. దీంతో పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్యకూడా బాగా తగ్గింది. ఈ లెక్కన కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చాలంటే మరో పదేండ్లయినా పడుతుందా అన్న అనుమానం పరిశీలకులకు కలుగుతున్నది. ఏడాదిలోనే భర్తీ చేస్తామని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. తమ ప్రభు త్వం ఏర్పడిన మూడు నెలల్లోనే దాదాపు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. కానీ, ఆయన ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు, మూడు వేల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. మరి, 30 వేల ఉద్యోగా లు ఎలా భర్తీ చేశారని బీఆరెస్ ప్రశ్నిస్తున్నది. తమ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల ప్రక్రియను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి వారివిగా గొప్పలు చెప్పుకొంటున్నదని కూడా బిఆరెస్ విమర్శిస్తున్నది. ఆ రెండు పార్టీల రాజకీయాలు ఎలా ఉన్నా, మరో ౮ నెలల్లో ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలెన్ని? ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తుంది? అనేది మాత్రం అంతుబట్టని ప్రశ్నగానే కనిపిస్తున్నది.  

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమిం చిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం 2014 నాటికి తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.07 లక్షల ఖాళీలు వున్నాయి. 2024 నాటికి 2.20 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్టు కేటీఆర్ తెలిపారు. ఈ లెక్కన పదేండ్లలో ఏర్పడిన ఖాళీలు 1.17 లక్షలు. కాగా, 2.20 లక్షల ఉద్యోగాల్లో టీఎస్‌పీఎస్సీ ద్వారా 36 వేలు మాత్రమే భర్తీ చేయగలిగారు. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనట్టేనని నిరుద్యోగుల వాద న. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భర్తీ ప్రక్రియ చేపట్టామని కేటీఆర్ చెప్పిన 2.20 లక్షల ఉద్యోగాల్లో 88 వేల ఉద్యోగాలకు నోటి ఫికేషన్లు మాత్రమే ఇచ్చారు. వాటి భర్తీ ప్రక్రియను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు.