పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వర్జీనియాలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ప్రపంచ నలుమూలలా తెలంగాణ పండుగైన బతుకమ్మను జరుపుకోవడం సంతోషాన్నిచ్చిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం వర్జీనియాలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనంతరం మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలను మరవొద్దని, వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐలు అందించిన సహకారాన్ని గుర్తుచేశారు. బతుకమ్మ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 7 వేల మంది ప్రవాసులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్జీనియాలో డెలిగేట్ శ్రీనివాసన్ కన్నన్, అటార్నీ జనరల్ జేసన్ ఎస్ మియారెస్, లౌడన్ కౌంటీ సూపర్‌వైజర్ లౌరా సావినో, లౌడన్ కౌంటీ స్కూల్ బోర్డు డాక్టర్ సుమేరా రిషీద్, డెమోక్రాట్ పార్టీ నేత నాగిరెడ్డి శ్రీధర్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ మునుకుంట్ల తిరుమల్ రెడ్డి, చైర్మన్ కళావల విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.