calender_icon.png 3 October, 2024 | 6:41 PM

ప్రతి ఇంటి నుండి వివరాలు సేకరించాలి

03-10-2024 04:21:27 PM

వనపర్తి,(విజయక్రాంతి): తెలంగాణ కుటుంబ గుర్తింపు కార్డు ప్రతి ఇంటి నుండి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఒక డిజిటల్ గుర్తింపు కార్డు జారీ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించిన నేపథ్యంలో పైలెట్ ప్రాజెక్టు గా ప్రతి జిల్లాలో ఒక మున్సిపల్ వార్డు, ఒక గ్రామ పంచాయతీకి సంబంధిన కుటుంబ వివరాల సేకరణ అక్టోబర్ 3 నుండి ప్రారంభం అయినది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలోని వవపర్తి మండలం ఆంజనగిరి గ్రామము, మున్సిపాలిటీలో 10వ వార్డును పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది.

గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి డిజిటల్ సర్వే బృంద సభ్యులకు శిక్షణ ఇచ్చారు. గ్రామ పంచాయతీకి రెండు బృందాలు, మున్సిపల్ వార్డుకు3 బృందాలను ఏర్పాటు చేసి ప్రతి బృందానికి  టిం లీడర్ గా తహసిల్దార్, ఎంపీడీఓ స్థాయి అధికారిని నియమించారు. అక్టోబర్ 7 సాయంత్రం లోపు సర్వే పూర్తి చేసేందుకు గడువు విధించారు.  కుటుంబంలో ఎక్కువ వయస్సు కలిగిన మహిళను కుటుంబ యజమానిగా గుర్తించాలని, ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి సర్వేలో నమోదు కావాలని ఆదేశించారు. 

కుటుంబ సర్వేలో ఆధారాలు అడగాల్సిన అవసరం లేదని, కుటుంబ సభ్యులు చెప్పిన రీతిగా వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అదనపు కలక్టర్ సంచిత గంగ్వార్ బృంద సభ్యులకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, డీపీఒ, తహశీల్దార్లు రాజు, రమేష్ రెడ్డి, ఏఓ కలేక్టరేట్ భాను ప్రకాష్, బృంద సభ్యులు, వార్డు ఆఫీసర్లు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.