- భవిష్యత్‌లో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో చేపడుతాం
- జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతాం
- బడుగు, బలహీన వర్గాల జనాభా ఎంతో తేలుద్ది
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో చేపట్టిన కులగణన చరిత్రాత్మకమని, జనగణనలా దీనిలో అందరూ భాగస్వామ్యులు అవుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
కుల గణనలో అడిగే ప్రశ్నలకు ఒక గదిలో కూర్చోని 15 మంది రూపొందించలేదని, ప్రజలే వాటిని డిజైన్ చేశారని, ఇది ప్రజా ప్రక్రియ తరహాలో కొనసాగుతోందని కితాబిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. అక్కడ కులగణన చేసి తీరుతామని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కులగణన చేపట్టామని.. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంచేశారు. ప్రతి సామాజికవర్గానికి సంబంధించి ఆర్థిక, సామాజిక స్థితిని తెలుసుకునేందుకు ఇది దోహద పడుతుందని చెప్పారు.
కుల గణనతో తెలంగాణలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా దోహదపడుతాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కోరామని, ఇందుకోసం పార్లమెంటులో పట్టుబట్టామని పేర్కొన్నారు. దేశంలో 15 శాతం దళితులు, 8 శాతం ఆదివాసీలు, 15 శాతం మైనార్టీలు ఉన్నారని.. కానీ వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారంటే ఆ లెక్కలు లేవని, కొందరు 50 శాతం ఉన్నారని, మరికొందరు 55 శాతం ఉన్నారని చెప్తున్నారని తెలిపారు.
తక్కువలో తక్కువ 50 శాతం ఉన్నారనుకున్నా.. ఈ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారంతా కలిసి 90 శాతం మంది ఉంటారని, వారికి రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే రిజర్వేషన్లు ప్రమాదంలో పడిపోతాయని, ఈ విషయాన్ని దేశ ప్రజలందరికి వివరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని చదవలేదు
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగాన్ని చదవలేదన్న విషయం ఆయన పాలన చూస్తుంటేనే అర్థమవుతోందని రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయం, సమానత్వం ప్రస్ఫుటిస్తుందని, మోదీ పాలనలో అది కొరవడిందని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన సామాజిక న్యాయం కోసం పోరాడిన వారిలో ఎందరో కనిపిస్తారని తెలిపారు.
కేరళలో నారాయణగురు, కర్ణాటకలో బసవేశ్వరుడు, మహారాష్ట్రలో పూలే, శివాజీ మహారాజ్.. ఇలా ప్రతి రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన వారిలో ఇద్దరు, ముగ్గురు ఉంటారని చెప్పారు. అయితే సావర్కర్ నినాదం దానికి విరుద్ధమని విమర్శించారు.