calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్గీకరణకు జై

19-03-2025 01:32:50 AM

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  1. 59 కులాలు మూడు గ్రూపులుగా విభజన 
  2. బిల్లు ప్రవేశపెట్టిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 
  3. మద్దతుగా నిలిచిన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ 
  4. విద్యా, ఉద్యోగాల్లో ఇక వర్గీకరణ అమలు

* నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావడం సంతోషం. 2026 జనాభా లెక్కల తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. మాదిగ అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. రాజీవ్ యువవికాసంలో మొదటి ప్రాధాన్యం కల్పిస్తాం.

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొం దింది. మూడు దశాబ్దాలకు పైగా జరుగుతున్న వర్గీకరణ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం శుభం కార్డు పలికింది. ఇక విద్యా, ఉద్యోగ నియామకాలను వర్గీకరణ మేరకే ప్రభు త్వం నిర్వహించనుంది.

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టగా.. అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజే పీ, ఎంఐఎం, సీపీఐ మద్దతు తెలిపి ఆమోదించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.. ‘దశాబ్దాలుగా వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది.

ఎంతో మంది ప్రాణాలు అర్పించారు.. ఈ  బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అభినందనీయం. మద్దతు పలికిన అన్ని పార్టీల సభ్యులకు కృతజ్ఞతలు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం సంతోషంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు. తన రాజకీయ ఎదుగుదలలో మాదిగల పాత్ర ఎంతో కీలకమని, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా విజయం సాధించడంలో మాదిగల కృషి ఎంతో ఉందని సీఎం వెల్లడించారు.

షమీమ్ అక్తర్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామని, 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచామన్నారు. గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2 లోని మాది గలు, ఉపకులాలకు 9 శాతం, గ్రూప్-3లోని మాలలు, మాల ఉపకులాలకు 5 శాతం రిజర్వేషన్లు పంపిణీ చేశామని వివరించారు.

‘మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీంకోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం.

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారు.

2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

మొదటి నుంచి దళితులకు అండగా కాంగ్రెస్.. 

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.  1960లోనే ఉమ్మడి రాష్ర్టంలో దామోదరం సంజీవయ్యలాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. దళితుడైన  మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందన్నారు.

రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నియమించిందని తెలిపారు. ఇక జగ్జీవన్‌రామ్‌కు కేంద్రంలో కీలకమైన రక్షణ, వ్యవసాయం, రైల్వే శాఖలను అప్పగించిందని, ఆయన కూతురు మీరాకుమార్‌కు లోక్‌సభ స్పీకర్‌గా అవకాశం ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మీరాకుమార్ హయాంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందినదన్నారు. 

మాదిగలు సమజానికి ఎంతో సేవ చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.  మాదిగలు సమాజానికి ఎంతో సేవ చేశారని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. వర్గీకరణ సమస్య పరిష్కారం కావడంతో మాదిగ, మాల ఎమ్మెల్యేలు, ప్రజలందరూ కలిసి ఉండాలని ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు.