calender_icon.png 25 September, 2024 | 3:49 AM

సుస్థిర అభివృద్ధికి తెలంగాణ అసెంబ్లీ చట్టాలు

25-09-2024 02:05:30 AM

ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తోంది 

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): సుస్థిరమైన అభివృద్ధి కోసం తెలం గాణ చట్టాలు రాష్ట్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఈ చట్టాలతో రాష్ట్రం విద్య, ఆరోగ్యం, సమానత్వం, పరిశుభ్రమైన తాగునీరు, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో జాతీయ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలవడానికి దోహదపడిందని గుర్తుచేశారు.

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన పార్లమెంట్ భవన్‌లోని ప్రధాన కమిటీ హాల్లో జరిగిన 10 కామన్‌వ్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రిజీయన్ కాన్ఫరెన్స్‌లో ‘ సుస్థిరమైన అభివృద్ధిలో శాసనవ్యవస్థల పాత్ర’ పై స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడారు.

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు సుస్థిర అభివృద్ది కోసం ఉద్దేశించిన చట్టాలను, నియమాలను రూపొందించడంతోపాటు వాటి అమలును నిత్యం వివిధ స్థాయిలలో పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.

అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేసిందని తెలిపారు. ఈ పథకాల అమలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు తోడ్పడిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు.  

ఎన్‌హెచ్‌గా అప్‌గ్రేడ్ చేయండి

వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యం త ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మం త్రి నితిన్ గడ్కరీని కోరారు. కోకాపేట ఓఆర్‌ఆర్ బుదేరా రోడ్డు (80కిలోమీటర్లు), తాం డూరు సదాశివపేట రోడ్డు (63.20 కిలోమీటర్లు), వికారాబాద్ మోమిన్‌పేట రోడ్డు (19.60కిలోమీటర్లు) రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని పేర్కొన్నారు.

సీఆర్ ఐఎఫ్ పథకం ద్వారా నియోజకవర్గంలోని ఏడు రోడ్లకు రూ.315 కోట్ల నిధులు మం జూరు చేయాలని కోరారు. స్పీకర్ వెంట చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ తదితరులున్నారు.