- ఏఐ వినియోగించే సంస్థలకు ప్రభుత్వ సహకారం
- మున్ముందు రాష్ట్రానికి మరిన్ని సిలికాన్ వ్యాలీ సంస్థలు
- హైదరాబాద్‌ను ‘ఆర్కిటెక్ట్ మార్వెల్’గా తీర్చిదిద్దుతాం..
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ మున్ముందు గ్లోబల్ ఏఐ హబ్‌గా నిలవబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను వినియోగించే వైద్య సంస్థలు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం, ప్రోత్సాహకాలు అందుతాయని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో సోమవారం ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో కృత్రిమ మేధ’ అనే అంశపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్‌కు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారుస్తామని ప్రకటించారు.
ఇప్పటికే రాష్ట్రం సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సెన్సైస్ పరిశోధన, అభివృద్ధి అంశాల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని, మున్ముందు రాష్ట్రానికి మరిన్ని సిలికాన్ వ్యాలీ సంస్థలను తీసు కొస్తామని ఆయన వెల్లడించారు. నాలుగో పారిశ్రమిక విప్లవ కేంద్రమైన హైదరాబాద్‌లో వైద్యరంగంలో ఏఐ సేవలను విస్తృత పరిచేందుకు కృషి చేస్తామన్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసి ప్రపంచ ఆరోగ్య రంగానికి దిక్సూచిగా ఏఐజీ మారిందని కొనియాడారు. ఇప్పటికే కృత్రిమ మేధతో పనిచేసే ‘మిరా’ అనే వర్చ్యువల్ వైద్య సహాయకురాలిని ప్రవేశ పెట్టడం అభినందనీయమ న్నారు. వైద్య సంరక్షణలో కృత్రిమ మేధ వినియోగంపై రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సూచిం చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేసి పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేస్తామన్నారు. సిటీ ని ఆర్కిటెక్ట్ మార్వెల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీకాం, బీబీఏ చదువుతున్న విద్యార్థులను కోర్సు రెండో సంవత్సరం నుంచే శిక్షణ ఇస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్స్యూరెన్స్ ఉద్యోగాల వైపు మళ్లిస్తామన్నారు.
అధునాతన ఏఐ టెక్నాలజీతో ప్రజ లకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని తాము విశ్వసిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలకు తమ ప్రభుత్వం సహకరిస్తుందని భరోసానిచ్చారు. ఏఐ, బయోటెక్, డాటా సైన్స్ వంటి రంగాలకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు.
ఏఐ అభివృద్ధి కోసం ఇప్పటికే అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సదస్సులో ఏఐజీ చైైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సింగపూర్ నేషనల్ వర్సిటీ డీన్ హో, నారాయణ వైద్యాలయ వైస్ చైర్మన్ వీరేన్ శెట్టి, ప్రపంచ ఆరోగ్యసంస్థ డిజిటల్ హెల్త్ విభాగం సభ్యుడు రాజేంద్ర గుప్తా, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హెల్త్ సెన్సైస్ ఫౌండేషన్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.