అత్యుత్తమ గమ్యస్థానంగా హైదరాబాద్
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఐఎంఈఎక్స్- 2024 ట్రేడ్ షోలో తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబర్ 10(విజయక్రాంతి): ప్రపంచస్థాయి పెట్టుబడులకు కేంద్ర బిందువుగా తెలంగాణ మారిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భా గంగా ఆయన గురువారం లాస్ వెగాస్‌లో నిర్వహించిన ఐఎంఈఎక్స్-2024ట్రేడ్ షోకు హాజరయ్యారు.
ట్రేడ్ షోలో ఏర్పాటు చేసిన తెలంగాణ టూరిజం శాఖ స్టాల్ ను ఆయన ప్రారంభించారు. ప్రపంచస్థాయి వేదికపై తెలంగాణ టూరిజం స్టాల్ ఏర్పాటు చేయడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పర్యాటక, వినోదం, వ్యాపార, ఐటీ, హెల్త్, ఫార్మా రంగాల్లో అత్యుత్తమ గమ్యస్థానంగా హైదరాబాద్ నిలుస్తోందన్నారు.
పర్యాటక రంగంలో భాగస్వాముల సహకారంపై తమ ప్రభుత్వం దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, వారసత్వం, సంస్కృతి, పర్యాటక ప్రాంతాల గురించి స్థానిక మీడియా, తెలుగు అసోసియేషన్ సభ్యులతో మంత్రి మాట్లాడారు. అనంతరం వాణిజ్య ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విదేశీ స్టాళ్లను సందర్శించారు.
కొత్త అనుభూతులు, అన్వేషించని ప్రదేశాలను చూడాలని కోరుకునే నేటి తరం పర్యాటకులు తెలంగాణకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ఎన్. ప్రకాశ్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఓంప్రకాశ్, టీఎస్‌టీడీసీ మార్కెటింగ్ జీఎం అంజిరెడ్డి, హెచ్‌సీవీబీ సీఈఓ గ్యారీ ఖాన్ తదితరులు హాజరయ్యారు.