calender_icon.png 9 January, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ

04-01-2025 02:27:49 AM

  • పాలసీతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
  • ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తే లక్ష్యం
  • క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

  • హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకోవడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మార్చాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగం లో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ముం దంజలో ఉందని చెప్పారు.

  • ఈ రంగంలో రాష్ర్టం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, మరి న్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ర్టం సుస్పష్టమైన విధానాలతో పాలసీని తీసుకొస్తున్నట్టు వివరించారు. శుక్రవారం హెచ్‌ఐ సీసీలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై స్టేక్ హోల్డర్స్‌తో భట్టి సమావేశ మయ్యారు.

  • అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ రంగం లో అద్భుత విజయాలను సాధిస్తూ.. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగంలో ప్రస్తుతం రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్‌పవర్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుందని చెప్పారు.

  • 20 వేల మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టంచేశారు. ప్రస్తుతం విండ్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ 8వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల  అభివృద్ధికి కేంద్రంగా మారినట్టు చెప్పారు.  

పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు

నూతన పాలసీలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించనున్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 872 ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈవీ వాహనాలు పెరిగే కొద్దీ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. కొత్త పాలసీలో పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, చెల్లింపుల సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తామని వివరించారు.

వ్యర్థాలను ఇంధనంగా మార్చడం వంటి ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మెరుగు పరచడంతోపాటు శక్తి వినియోగంలో ప్రజ ల భాగస్వామ్యాన్ని పెంచడమనే ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో రాష్ర్టం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని అన్నారు.

2024లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్ల నుంచి 2030 నాటికి 24,215 ఎంవీకి, 2035 నాటికి 31,809 ఎంవీ వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చేం దుకు స్వచ్ఛమైన, స్థిరమైన శక్తి వనరులు చాలా కీలకమన్నారు.

రాష్ర్ట ప్రభుత్వం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, పంప్‌డ్ స్టోరేజ్ వంటి ఆధు నిక పద్ధతులను ప్రోత్సహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, ఏఈఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లాజిస్టిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తాం

పట్టణ జనాభా అవసరాలను తీర్చేందుకే ఫోర్త్ సిటీని తీసుకొస్తున్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టెక్నాలజీలతో ఆధునిక నగర అభివృద్ధికి పాటుపడుతామని చెప్పారు.

తెలంగాణను గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దుతూ, లైఫ్ సెన్సైస్ రంగంలో అగ్రగామిగా మార్చడమే తమ లక్ష్యమని వివరించారు. నాలుగో నగరం, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తామని వెల్లడించారు.