* టైర్ 2, 3 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాం
* రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు దేశంలోనే హైదరాబాద్ కేంద్రం గా మారిందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. జీసీసీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయబోమని రాష్ట్రంలోని టైర్ టైర్ నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
సాంకేతిక ఫలాలను మారుమూల పల్లెల్లో ఉన్న చివరి వ్యక్తి వరకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. దావోస్‌లో బుధవారం సీఐఐ, పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటరాక్షన్‌లో ‘డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్: ఇండియాస్ స్ట్రాటెజిక్ అడ్వాంటేజస్ ఇన్ జీసీసీ’ అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.
హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరులు, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులు చాలా కీలకమని చెప్పా రు. అందుకే రాబోయే రోజుల్లో నైపుణ్య మా నవ వనరులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రొఫెసర్ క్లాస్‌శ్వాబ్‌తో శ్రీధర్‌బాబు సమావేశం
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ప్రపంచ ఆర్థిక విధానాల రూపశిల్పి ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్‌తో ఐటీ, పరిశ్రమల దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం సమావేశమయ్యారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన ఆయన్ను కలిసే అవకాశం రావడం తనకు లభించిన అద్భుతమైన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. ఈమేరకు ఎక్స్ ద్వారా తన అనుభవాలను శ్రీధర్‌బాబు వెల్లడించారు.
ఆవిష్కరణలు, సాంకేతిక, స్థిరమైన అభివృద్ధిలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇదొక మైలురాయి అన్నారు. ప్రొఫెసర్ శ్వాబ్‌తో - కృత్రిమ మేధస్సు, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ప్రగతి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి చర్చించినట్లు వివరించారు.
ప్రొఫెసర్ ప్రశంసలు..
ప్రొఫెసర్ క్లాస్ శ్వాబ్ తెలంగాణ ప్రగతిపై ప్రశంసలు అందించారు. రాష్ర్టం నాలుగో పారిశ్రామిక విప్లవంలో ముందంజలో నిలుస్తుందన్నారు. భవిష్యత్ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే శక్తిగా మారనున్నదని పేర్కొన్నారు. పారిశ్రామిక విప్లవం, సాంకేతిక మార్పుల్లో తెలంగాణ చూపుతున్న నైపుణ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.