1956 వరకు గవర్నర్ గా నిజాం ఉంటే హైదరాబాద్ విముక్తి ఎట్లా అయిందో బిజెపి సమాధానం చెప్పాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ
జహీరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కె. నరసింహులు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి. నరసింహ మాట్లాడుతూ... హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాచరిక పరిపాలనకు, భూస్వామ్య పెత్తందారుల ఆధిపత్యాలు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం ద్వారా నిజాం, భూస్వాముల ఆగడాలను నిలవరించారని తెలిపారు. ప్రజలపై బలవంతంగా పన్నులు వసూలు చేసే పట్వారి కరణం వ్యవస్థ ఆనాడు కొనసాగింది. వీళ్లు తమ ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేసేవారు. కరువు, కాటకాలు వచ్చి పంటలు పండక పోయినా, శిస్తు కట్టలేని ప్రజల దగ్గర ఉన్న భూములను బలవంతంగా లాక్కున్నారు.
ఎలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. పన్నుల ద్వారా వసూలు కాపాడిన ధనం వలన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిజాం రాజు ఉన్నాడు. ఈ ఆధిపత్యం, అణచివేత నుంచి మొదలైన ప్రజా ఉద్యమం సాయుధ తిరుగుబాటుకు దారితీసింది. ఉద్యమ ఉధృతంతో నిజాంపాలన కుప్పకూలే దశకు చేరుకుంది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన కేంద్రం ఇటు నిజాం ను తమకు అనుకూలంగా మలచుకోవడం అటు కమ్యూనిస్టుల నాయకత్వంలో కొనసాగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని అణచివేయడం కోసం కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంలోకి తన సైనిక బలగంతో దిగాడు. ప్రజలు భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న లక్షలాదికరాల భూములను, అధికారాలను తిరిగి భూస్వామ్య వర్గానికి కట్టబెట్టడానికి మరియు నిజాం యొక్క ఆస్తులను పరిరక్షణ కోసం అంతర్గతంగా ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
ఇందులో భాగంగానే 1956 వరకు నిజాం (గవర్నర్) రాజ్ ప్రముఖ్ గా కొనసాగటమే కాకుండా నష్టపరిహారం, రాజభరణాలు,అనేక సంవత్సరాలు పొందటానికి అంగీకార పత్రం రాసుకున్నారు. ఈ వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియనీయకుండా బిజెపి ఈ పోరాటాన్ని ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటు చేశారని ఒక తప్పుడు సంకేతాన్ని, చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్ సంస్థానం పటేల్ సైన్యంతో విముక్తి, విమోచన అయితే ఎందుకు నిజాం గవర్నర్ పదవిలో ఉన్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామాలలో దేశ్ ముఖ్, పటేల్ , పట్వారి,దొరల ల యొక్క దుర్మార్గమైన అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాయుధ పోరాటం చేసి వాళ్లను గ్రామాలనుంచి తరిమితన్నారు. బిజెపి పార్టీ ఈ దొరల భూస్వాములు చేసిన ఆగడాల గురించి, మహిళలపై వారు చేసిన అత్యాచారాల పై మాట్లాడకుండా ఉండటం అంటే భూస్వాములకు మద్దతు పలకడమే అని అన్నారు.
భూ పోరాటాలు చేసిన ఘనత సిపిఐదే జలాలుద్దీన్ సిపిఐ జిల్లా కార్యదర్శి
ఉమ్మడి మెదక్ జిల్లాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేసి భూస్వాముల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఉన్నదని అన్నారు. సిపిఐ నాయకత్వంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.