calender_icon.png 27 October, 2024 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆర్కిటెక్చర్ అద్భుతం

29-07-2024 02:52:18 AM

సంస్కృతి, సంప్రదాయాల రక్షణకు కృషి  

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): చరిత్రాత్మక కట్టడాలు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌కు నిలయం తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమం ఆదివారం కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్, ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ డైరెక్టర్ మోన్రియా, ప్రిన్స్ రహీమ్ ఆఘాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని అన్నారు. మన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటంతో పాటు తెలంగాణను  ప్రపంచ పటంలో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహీన్ రాజవంశం నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయని కొనియాడారు. రాష్ట్రంలోని రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించడం తెలంగాణకు గర్వ కారణమని అన్నారు.

ఆఘాఖాన్ ట్రస్ట్ కల్చర్ సొసైటీతో 2013లో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతోపాటు 106 ఎకరాల విస్తీర్ణంలోఉన్న కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ పరిరక్షణకు చేపట్టిన ప్రయత్నం అసాధారణమని కొనియాడారు. ఈ ప్రయత్నంలో ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి తెలంగాణ ప్రభు త్వం, హైదరాబాద్ ప్రజల తరుపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.