calender_icon.png 9 October, 2024 | 7:43 PM

తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి

09-10-2024 05:51:49 PM

ఉద్యమకారుల పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండ్రా రాజేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాదయాత్రకు సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రము ఏర్పడి పదేళ్లు దాటిన ఉద్యమకారులకు గుర్తింపు లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా మమేకమై ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

ఉద్యమకారులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని, రానున్న లోకల్ ఎలక్షన్లో ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం కల్పించాలని, ఉద్యమకారులకు ప్రతి జిల్లాలో సంక్షేమ భవనం నిర్మించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులయినా 1250 మంది అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయాలని, తెలంగాణ ఉద్యమకారులను వెంటనే గుర్తింపు కార్డు ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్, ఫ్రీ బస్సు, పెన్షన్ వెంటనే కల్పించాలని పలు డిమాండ్లు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ దర్ము, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోయిన్, నాయకులు రవీందర్ లక్ష్మణ్ వసంతరావు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.